సికింద్రాబాద్ పరిధిలోని తిరుమలగిరి మున్సిపాలిటీలో మోత్కూర్ రోడ్డుపై ఉన్న సమత ప్రింటింగ్ ప్రెస్‌లో విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ కారణంగా తీవ్ర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఆఫ్‌సెట్ ప్రింటింగ్, ఫ్లెక్స్ ప్రింటింగ్ మిషన్లు పూర్తిగా దగ్ధమై భారీ ఆస్తి నష్టం వాటిల్లింది. స్థానికులు, దుకాణ యజమాని గుండు కిరణ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం సోమవారం ఉదయం సుమారు 7 గంటల సమయంలో ప్రెస్ నుంచి దట్టమైన పొగలు వెలువడటాన్ని గమనించి వెంటనే లోపలికి వెళ్లి చూడగా మంటలు చెలరేగినట్లు గుర్తించారు. అప్పటికే దుకాణంలోని మూడు కంప్యూటర్లు, మూడు ప్రింటర్లు, కౌంటర్‌లో ఉన్న రూ. 4,500 నగదు, సుమారు రూ.2 లక్షల విలువైన ఫర్నిచర్‌తో పాటు ఇతర సామాగ్రి పూర్తిగా కాలిపోయినట్లు తెలిపారు. చుట్టుపక్కల వ్యాపారులు, మున్సిపాలిటీ సిబ్బంది సహకారంతో మంటలను అదుపులోకి తీసుకువచ్చినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయిందని బాధితుడు గుండు కిరణ్ కుమార్ వాపోయారు. ఈ ప్రమాదంలో మొత్తం మీద రూ.13 లక్షలకు పైగా ఆస్తి నష్టం జరిగినట్లు ఆయన వెల్లడించారు. దుకాణానికి ఇన్సూరెన్స్ భీమా సౌకర్యం ఉన్నందున సకాలంలో నష్టపరిహారం అందేలా చర్యలు చేపట్టాలని కోరారు. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా నిర్ధారణ కాలేదని, ప్రాథమిక పంచనామా నిర్వహించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు స్థానిక ఎస్సై వెంకట్ రెడ్డి తెలిపారు. ఈ ఘటనతో మోత్కూర్ రోడ్డులో కొంతసేపు ఆందోళన వాతావరణం నెలకొంది.
0 Comments