తిరుమలలో భోగి పండుగ వేడుకలు భక్తుల కోలాహలంతో వైభవంగా సాగాయి. ఈ తెల్లవారు జామున శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ మహాద్వారం వద్ద సంప్రదాయబద్ధంగా భోగి మంటలను వెలిగించారు. చలికాలంలో భోగి మంటల వెలుగులు ఆలయ పరిసరాలను ఆధ్యాత్మిక వాతావరణంతో నింపాయి. కాగా, భక్తుల రద్దీ తక్కువగా ఉండటంతో భక్తులు తక్కువ సమయంలోనే శ్రీవారిని కనులారా దర్శించుకునే అవకాశం దక్కుతోంది. తిరుమలలో భోగి పండుగ వేడుకల్లో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని భోగి మంటల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ 'గోవిందా... గోవిందా...' అనే నామస్మరణతో తిరుమల కొండలు మార్మోగించారు. భక్తుల భక్తిశ్రద్ధలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. భోగి సంబరాల అనంతరం ఆలయ ద్వారాలను తెరిచి శ్రీవారికి ధనుర్మాసానికి సంబంధించిన ప్రత్యేక కైంకర్యాలు నిర్వహించారు. ఉషోదయ సేవ, సుప్రభాత సేవతో పాటు ఇతర నిత్య ఆరాధనలు శాస్త్రోక్తంగా జరిగాయి. ఈ ప్రత్యేక పూజల్లో పాల్గొనడానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. సహజంగా సంక్రాంతి పండగ మూడు రోజుల పాటు తిరుమలలో రద్దీ తక్కువగానే ఉంటుంది. సంక్రాంతి పండగను సొంతూళ్లలో బంధు మిత్రుల మధ్య జరుపుకోవడం సంప్రదాయంగా వస్తుంది. అందుకే తిరుమలకు వచ్చే వారి సంఖ్య తక్కువగా ఉంటుంది. ముక్కోటి ఏకాదశి నుంచి తిరుమలకు వచ్చే వారి భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా స్వామి వారి హుండీ ఆదాయం కూడా గణనీయంగా పెరిగిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. అన్నదానానికి హాజరయ్యే భక్తుల సంఖ్య కూడా ఎక్కువగా ఉంది. ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని నాలుగు కంపార్ట్ మెంట్ల లోనే భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనం క్యూ లైన్ లోకి ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం కేవలం నాలుగు గంటల సమయం మాత్రమే పడుతుందని అధికారులు వెల్లడించారు. టైమ్ స్లాట్ దర్శనానికి రెండు గంటల సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టోకెన్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం గంటలోపే పూర్తి చేసుకుంటున్నారు. దీంతో.. మరో రెండు రోజులు తిరుమలలో రద్దీ తక్కువగానే ఉండే అవకాశం కనిపిస్తోంది.
0 Comments