స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్‌పై కంటెంట్ క్రియేటర్ ఆర్జే మహ్వాష్ సంచలన ఆరోపణలు చేసింది. అతని పేరు ప్రస్తావించకుండా విమర్శలు గుప్పించింది. అతను ఓ మోసగాడని, ఎవరూ నమ్మొద్దని రిక్వెస్ట్ చేసింది. యుజ్వేంద్ర చాహల్, ఆర్జే మహ్వాష్ డేటింగ్ చేసినట్లు వార్తలు వచ్చాయి. ఈ వార్తలను ఈ ఇద్దరూ ధ్రువీకరించలేదు. కానీ బాహటంగానే కలిసి తిరిగారు. పార్టీలకు హాజరయ్యారు. ముఖ్యంగా ధనశ్రీ వర్మతో చాహల్ విడాకుల అనంతరం బాగా సన్నిహితంగా మెదిలారు. దాంతో ఈ ఇద్దరి మధ్య ప్రేమాయణం నడుస్తుందని సోషల్ మీడియా కోడై కూసింది. ఏమైందో ఏమో తెలియదు కానీ, ఈ ఇద్దరూ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకున్నారు. ఈ ఇద్దరూ అన్‌ఫాలో చేసుకోవడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ క్రమంలోనే చాహల్ బిగ్‌బాస్ 13 ఫేమ్ షెఫాలి బగ్గతో కలిసి డిన్నర్ చేస్తూ కనిపించాడు. ఈ ఫొటోలు నెట్టింట వైరల్ కాగా.. చాహల్ మరో అమ్మాయిని పట్టాడంటూ నెటిజన్లు కామెంట్ చేశారు. ఈ క్రమంలోనే ఆర్జే మహ్వాష్ సోషల్ మీడియా వేదికగా వరుసగా క్రిప్టిక్ పోస్ట్‌లు పెట్టింది. ఇందులో చాహల్ పేరును ప్రస్తావించకపోయినా.. అతన్ని ఉద్దేశించే ఈ పోస్ట్‌లు పెట్టిందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఇటీవల ఆర్జే మహ్వాష్ ఒక వీడియోను షేర్ చేసింది. ఇందులో '90 శాతం సమయాన్ని నేను నా జట్టును సర్దుకోవడానికే కేటాయిస్తాను. మీ అందరికి ప్రశాంతత లభించాలని కోరుకుంటున్నాను. ఈ ఏడాది ఇతరులను మార్చాలనే నా అలవాటును మానేయాలనుకుంటున్నాను. ఆ కోరిక కూడా చచ్చిపోయింది. నువ్వు ఒక నీచమైన పని చేశావు. నా జీవితం నుంచి వెళ్లిపో' అని హిందీలో గట్టిగా అరిచింది. చాహల్ మరో అమ్మాయితో కనిపించాడనే వార్తలు వచ్చిన కొద్దీ సేపటికే ఆర్జే మహ్వాష్ ఈ వీడియోను షేర్ చేయడం చర్చనీయాంశమైంది. చాహల్‌ను ఉద్దేశించే ఆమె ఈ వ్యాఖ్యలు చేసిందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. కానీ ఆర్జె మహ్వాష్ ఉద్దేశం ఏంటి అనేదానిపై స్పష్టత లేదు.
0 Comments