ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం, బిందెల కాలనీలో వుంటున్న వీరాంజనేయులు, లక్ష్మీగంగ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. గత కొంతకాలంగా భర్తకు భార్యపై అనుమానం పెరిగింది. ఈ అనుమానమే తరచూ భార్యాభర్తల మధ్య గొడవలకు దారితీసింది. మంగళవారం రాత్రి కూడా వీరాంజనేయులు, లక్ష్మీగంగ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. మాటల తూటాలు ఉద్రిక్త స్థాయికి చేరాయి. ఆ గొడవ తర్వాత కుటుంబ సభ్యులు నిద్రపోయారు. అయితే బుధవారం తెల్లవారుజామున, నిద్రలో ఉన్న లక్ష్మీగంగపై వీరాంజనేయులు కత్తితో దాడి చేసి గొంతు కోసి చంపాడు. హత్య చేసిన అనంతరం వీరాంజనేయులు తన ఇద్దరు పిల్లలను వెంట తీసుకుని నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు. అక్కడ జరిగిన విషయాన్ని పోలీసులకు వివరించి లొంగిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అనుమానంతో జరిగిన ఈ కుటుంబ హత్యపై పోలీసులు కేసు నమోదు చేసి, పూర్తి వివరాలు సేకరిస్తున్నారు.
0 Comments