Ad Code

చైనా అధినేత జిన్‌పింగ్‌తో దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే మ్యుంగ్ భేటీ


క్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే మ్యుంగ్, చైనా అధినేత షీ జిన్‌పింగ్‌తో భేటీ కావడం ప్రపంచం దృష్టిని అమితంగా ఆకర్షి​ంచింది. దశాబ్దాల ఉద్రిక్తతల తర్వాత, అధ్యక్షుడు లీ జే మ్యుంగ్ సోమవారం బీజింగ్‌లో షీ జిన్‌పింగ్‌తో భేటీ అయ్యారు. గంభీరంగా సాగిన చర్చల మధ్య, గత ఏడాది జిన్‌పింగ్ తనకు బహుమతిగా ఇచ్చిన షియోమీ ఫోన్‌తో లీ ఆయనతో సెల్ఫీ దిగారు. 'ఫోన్ పిక్చర్ క్వాలిటీ బాగుంది' అంటూ ఆయన చేసిన పోస్ట్, ఇరు దేశాల మధ్య నెలకొన్న వైరం తొలగిపోతున్నదనే సంకేతాన్ని ప్రపంచానికి అందించింది. 2019 తర్వాత దక్షిణ కొరియా నేత చైనాను సందర్శించడం ఇదే తొలిసారి కావడం ఆసక్తికరంగా మారింది. చైనా, దక్షిణ కొరియాల మధ్య సంబంధం ఈ నాటిది కాదు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో జపాన్ నుంచి ఎదురవుతున్న దాడులను ఎదుర్కొనేందుకు ఈ రెండు దేశాలు చేతులు కలిపాయి. జపాన్ ఆక్రమణ నుండి కొరియాను రక్షించుకునేందుకు నాడు చైనా అండగా నిలిచింది. ఆనాటి పోరాట వీరుల స్మారకార్థం నేటికీ షాంఘైలో స్మృతి చిహ్నాలు కనిపిస్తాయి. తాజాగా దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే మ్యుంగ్ తన పర్యటనలో వాటిని సందర్శించడం ఇరు దేశాల మధ్య ఉన్న చారిత్రక సంబంధానికి నిదర్శనంగా నిలిచింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఇరు దేశాల పరిస్థితులు తలకిందులయ్యాయి. కొరియా యుద్ధం సమయంలో ఉత్తర కొరియాకు చైనా మద్దతు ఇవ్వగా, దక్షిణ కొరియాకు అమెరికా అండగా నిలిచింది. దీంతో దశాబ్దాల పాటు ఈ రెండు దేశాల మధ్య సయోధ్య కరువయ్యింది. 'బీబీసీ' కథనం ప్రకారం సుమారు 40 ఏళ్ల సుదీర్ఘ మౌనం తర్వాత, 1992లో ఇరు దేశాలు తిరిగి దౌత్య సంబంధాలను పునరుద్ధరించుకున్నాయి. వాణిజ్యమే పరమావధిగా చైనా తన దేశ తలుపులను తెరిచింది. దీంతో దక్షిణ కొరియా కంపెనీలు చైనాలో పెట్టుబడులు పెట్టడం ​మొదలుపెట్టాయి. నాటి నుండి ఆర్థికంగా ఇరు దేశాలు పరస్పరం ఆధారపడటం మొదలైంది. 2016లో దక్షిణ కొరియా తీసుకున్న ఒక నిర్ణయం చైనాకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. ఉత్తర కొరియా ముప్పు నుంచి తప్పించుకునేందుకు అమెరికాకు చెందిన 'థాడ్' క్షిపణి వ్యవస్థను దక్షిణ కొరియా తన గడ్డపై మోహరించింది. ఇది తమ భద్రతకు ముప్పుగా భావించిన చైనా, అప్పటి నుండి కొరియాపై అనధికారిక యుద్ధం కొనసాగిస్తోంది. ఆ క్షిపణి కారణంగా నెలకొన్న వివాదం దరిమిలా చైనాలో కొరియన్ పాప్ సంగీతం, సినిమాలు, నాటకాలపై అప్రకటిత నిషేధం మొదలైంది.





Post a Comment

0 Comments

Close Menu