తెలంగాణ లోని ఖమ్మం జిల్లాలో సీపీఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ పర్యటించి, పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యాలయం గిరిప్రసాద్ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ ట్రంప్ పిచ్చోడి చేతిలో రాయిలాగా వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఒక దేశ అధ్యక్షుడి ఇంటిపై దాడి చేసి కిడ్నాప్ చేసే నీచ స్థితికి ట్రంప్ దిగజారారని అన్నారు. ప్రపంచాన్ని బెదిరించాలనే దుస్సాహసానికి ట్రంప్ పాల్పడ్డారని ఆరోపణలు చేశారు. ఇంత జరుగుతున్నా ప్రధాని నరేంద్ర మోడీ ఎందుకు నోరు మెదపడం లేదన్నారు. తనను సంతృప్తిపరచాల్సిన బాధ్యత మోడీపై ఉందని డొనాల్డ్ ట్రంప్ ఇటీవల అన్నారని ప్రస్తావించారు. ఒకప్పుడు ప్రపంచ దేశాలకు నాయకత్వం ఇచ్చిన ఇండియా, ఇప్పుడు మాట్లాడలేని పరిస్థితికి ఎందుకు దిగజారిందని నిలదీశారు. మోడీ పాలనలో ప్రపంచ దేశాల్లో భారతదేశానికి విలువ లేకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఖమ్మం నగరంలో ఈ నెల 18వ తేదీన సీపీఐ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సీపీఐ జాతీయ నాయకులంతా ఈ బహిరంగ సభలో పాల్గొంటారని పేర్కొన్నారు. 18వ తేదీన నగరంలో భారీ ర్యాలీ నిర్వహిస్తామని చెప్పుకొచ్చారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కూడా సంఘీభావంగా ఈ ర్యాలీలో పాల్గొంటారని పేర్కొన్నారు. సీపీఐ ఆవిర్భావం నుంచి పోరాటాల పంథా కొనసాగించిందని తెలిపారు. పేదలు, కార్మికుల హక్కుల కోసం ఎంతోమంది జైలుకు వెళ్లారని అన్నారు. దేశం కోసం సీపీఐ ఎన్నో త్యాగాలు చేసిందని ప్రస్తావించారు. వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా పోరాటాల గడ్డ ఖమ్మంలో శతాబ్ది ఉత్సవాలు జరుపుకోవడం చాలా సంతోషకరంగా ఉందని చెప్పుకొచ్చారు. ఈ నెల 19, 20, 21 తేదీల్లో ఖమ్మంలో జాతీయ కౌన్సిల్ సమావేశం ఉంటుందని తెలిపారు. 20వ తేదీ వామపక్ష పార్టీల జాతీయ నాయకులు ఆహ్వానించి సెమినార్ ఏర్పాటు చేశామని అన్నారు. 18వ తేదీ నుంచి 21వ తేదీ వరకు జరిగే ఈ సెమినార్‌కు ఎనలేని ప్రాధాన్యత ఉందని వివరించారు. ఈ సెమినార్‌లో వామపక్ష పార్టీలు పాల్గొంటాయని వెల్లడించారు. వామపక్ష పార్టీలు దేశంలో ఇతర పార్టీలను కలుపుకొని పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని రామకృష్ణ స్పష్టం చేశారు.

0 Comments