Ad Code

తిరుమల లడ్డూలో 80% కెమికల్స్ : సిట్ చార్జ్‌షీట్‌లో చార్జిషీటు దాఖలు


తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారి లడ్డూ ప్రసాదం తయారీలో జరిగిన భారీ నెయ్యి కల్తీ బాగోతం బట్టబయలైంది. పవిత్రమైన లడ్డూ తయారీ కోసం గత మూడేళ్లలో ఏకంగా 68 లక్షల కిలోల కల్తీ నెయ్యిని కొనుగోలు చేసినట్లు ప్రత్యేక దర్యాప్తు బృందం తేల్చింది. సుదీర్ఘంగా 15 నెలల పాటు సాగిన విచారణ అనంతరం సిట్ శుక్రవారం నెల్లూరు ఏసీబీ కోర్టులో చార్జిషీటు దాఖలు చేసింది. ఇందులో మొత్తం 36 మందిని నిందితులుగా చేర్చారు. లడ్డూలో జంతువుల కొవ్వు వాడారన్న ఆరోపణలకు సాంకేతిక ఆధారాలు లభించలేదని, అయితే 80 శాతం రసాయనాలతో కూడిన విషతుల్యమైన నెయ్యిని వాడినట్లు సిట్ స్పష్టం చేసింది. దాదాపు రూ.250 కోట్ల మేర జరిగిన ఈ కుంభకోణాన్ని టీటీడీ చరిత్రలోనే అతిపెద్ద ప్రొక్యూర్మెంట్ స్కామ్‌గా అభివర్ణించారు. భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఉత్తరాఖండ్‌కు చెందిన 'భోలే బాబా డెయిరీ'ని ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా (A1) సిట్ పేర్కొంది. ఆ డెయిరీ డైరెక్టర్లు పోమిల్ జైన్, విపిన్ జైన్‌లు టీటీడీ ప్రొక్యూర్మెంట్ విభాగం సిబ్బందితో కుమ్మక్కై ఈ దందా నడిపారు. బాహ్య డెయిరీ నిపుణుడు విజయ్ శేఖర్ రెడ్డి, ఢిల్లీకి చెందిన కెమికల్ సప్లయర్ అజయ్ కుమార్ సుగంధ్ సహకారంతో రసాయనాలతో నిండిన నాసిరకం నెయ్యిని తిరుమలకు సరఫరా చేశారు. విచిత్రమేమిటంటే.. మొదట ఈ కేసులో ఫిర్యాదు చేసిన టీటీడీ రిటైర్డ్ జనరల్ మేనేజర్ (ప్రొక్యూర్మెంట్) ప్రళయ కావేరి మురళీకృష్ణనే ఇప్పుడు నిందితుడిగా మారారు. విచారణలో ఆయన పాత్ర కూడా ఉన్నట్లు తేలడంతో సిట్ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ కుంభకోణంలో టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వ్యక్తిగత సహాయకుడు చిన్న అప్పన్నతో పాటు ఏడుగురు ప్రొక్యూర్మెంట్ ఉద్యోగుల పేర్లు చార్జిషీట్లో ఉన్నాయి. వైవీ సుబ్బారెడ్డిని అధికారులు గతంలో ప్రశ్నించినప్పటికీ, ఆయన పేరును ప్రస్తుత నిందితుల జాబితాలో చేర్చలేదు. వైష్ణవి డెయిరీ సీఈవో అపూర్వ వినాయకాంత్ చావడా, ఏఆర్ డెయిరీ ఎండీ రాజశేఖరన్‌లు కూడా ఈ కుట్రలో భాగస్వాములైనట్లు తేలింది. వీరంతా కలిసి నాణ్యత లేని నెయ్యిని సరఫరా చేసి కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కాజేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 2024 అక్టోబరులో ఈ కేసు దర్యాప్తు ప్రారంభమైంది. సీబీఐ, ఏపీ పోలీసులు, ఎఫ్ఎస్ఎస్ఏఐ (FSSAI) అధికారులతో కూడిన ప్రత్యేక బృందం 12 రాష్ట్రాల్లో విస్తృతంగా పర్యటించింది. నెయ్యి సరఫరా గొలుసు, ప్రొక్యూర్మెంట్ రికార్డులు, ల్యాబ్ నివేదికలు, ఆర్థిక లావాదేవీలను క్షుణ్ణంగా పరిశీలించి ఈ భారీ స్కామ్‌ గుట్టురట్టు చేసింది. రాజకీయంగా పెను దుమారం రేపిన ఈ కేసులో జంతువుల కొవ్వు ఆరోపణలు నిర్ధారణ కాకపోయినా, ప్రమాదకర రసాయనాలు వాడటం భక్తులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.

Post a Comment

0 Comments

Close Menu