ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి పీఎస్‌ఎల్‌వీ సీ-62 ఉపగ్రహ వాహకనౌక నింగిలోకి దూసుకెళ్లింది. ఈ ప్రయోగం ద్వారా 1,485 కిలోల బరువు కలిగిన ఈఓఎస్-ఎన్1 (అన్వేష) ఉపగ్రహాన్ని, మరో 15 చిన్న ఉపగ్రహాలను అంతరిక్షంలో ప్రవేశపెట్టనున్నారు. ఈ ప్రయోగం దేశ రక్షణ రంగానికి అత్యంత కీలకమైనది. ఈ ఏడాది ఇస్రో చేపట్టిన తొలి ప్రయోగ్రం ఇదే. ఈ చిన్న ఉపగ్రహాల్లో మన దేశంలోని మూడు స్టార్టప్ కంపెనీలకు చెందిన ఏడు, విదేశాలకు చెందిన ఎనిమిది ఉన్నాయి. వీటిని న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్ పర్యవేక్షణలో వాణిజ్యపరంగా ప్రయోగిస్తున్నారు. రాకెట్ ప్రయోగించిన తరువాత 17.54 నిమిషాలకు స్పెయిన్ దేశానికి చెందిన బుల్లి ఉపగ్రహం మినహా మిగిలిన ఉపగ్రహాలను భూమికి 600 కిలోమీటర్ల ఎత్తులోని సన్ సింక్రనస్ ఆర్బిట్‌లోకి ప్రవేశపెడతారు. ఈ దఫా రాకెట్‌లోని నాలుగోదశ (పీఎస్-4)తో కొత్త ప్రయోగం చేస్తున్నారు. ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టిన తరువాత రాకెట్‌లోని నాలుగోదశను క్రమేణ కిందకు దించుతూ రెండుసార్లు రీస్టార్ట్ చేస్తారు. ఆ తరువాత స్పెయిన్‌లోని స్పానిష్ స్టార్టప్ సంస్థకు చెందిన కెస్ట్రెల్ ఇనిషియల్ టెక్నాలజీ, డిమాన్‌స్ట్రేటర్ (కిడ్) అనే పేలోడ్‌ను అంతరిక్షంలోకి ప్రవేశపెడతారు. అనంతరం అది భూ వాతావరణంలోకి ప్రవేశించి దక్షిణ ఫసిఫిక్ మహాసముద్రంలో పడిపోయే విధంగా ప్రణాళిక రూపొందించారు. పీఎస్‌ఎల్‌వీ సీ-62 ద్వారా ప్రయోగించనున్న ఈఓఎస్-ఎన్1 (అన్వేష్) ఉపగ్రహాన్ని భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) అడ్వాన్స్‌డ్ టెక్నాలజీతో రూపొందించింది. దీన్ని ప్రధానంగా దేశ రక్షణ కోసం ఉపయోగించనున్నారు. గూఢచారి ఉపగ్రహాల కుటుంబంలో ఇది అత్యంత సాంకేతిక పరిజ్ఞానం కలిగి ఉన్న ఉపగ్రహం.
0 Comments