కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఒకే ఒక్క నిర్ణయం దేశీయ దిగ్గజ కంపెనీ ఐటీసీ షేర్లను అతలాకుతలం చేసింది. ఈ ప్రభావంతో ఐటీసీలో భారీగా పెట్టుబడులు పెట్టిన ప్రభుత్వ బీమా సంస్థ ఎల్ఐసీకి కేవలం రెండు రోజుల్లోనే సుమారు రూ. 12,000 కోట్ల సంపద ఆవిరైపోయింది. పొగాకు ఉత్పత్తులపై కేంద్ర ప్రభుత్వం పన్నుల బాదుడు మొదలుపెట్టడమే దీనికి ప్రధాన కారణం. సిగరెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తులపై 40 శాతం జీఎస్టీతో పాటు, అదనపు ఎక్సైజ్ సుంకాన్ని పెంచుతున్నట్లు కేంద్రం అధికారికంగా ప్రకటించింది. ఈ కొత్త నిబంధనలు ఫిబ్రవరి 1, 2026 నుంచి అమలులోకి రానున్నాయి. ఐటీసీ కంపెనీకి ప్రధాన ఆదాయ వనరు సిగరెట్ల విక్రయమే. పన్నులు పెరగడం వల్ల కంపెనీ లాభాలు తగ్గుతాయన్న ఆందోళనతో ఇన్వెస్టర్లు షేర్లను విక్రయించడం మొదలుపెట్టారు. రెండ్రోజుల్లోనే ఐటీసీ షేరు దాదాపు 14 శాతం పడిపోయింది. రూ. 491 వద్ద ఉన్న 52 వారాల గరిష్ఠ ధర నుంచి ఏకంగా రూ. 350 స్థాయికి పడిపోయింది. కంపెనీ మొత్తం మార్కెట్ విలువలో రూ. 72,300 కోట్లు ఆవిరైపోయాయి. ఐటీసీ కంపెనీలో ఎల్ఐసీకి 15.86 శాతం వాటా ఉంది. అంటే ఎల్ఐసీ వద్ద సుమారు 198 కోట్లకు పైగా ఐటీసీ షేర్లు ఉన్నాయి. షేరు ధర భారీగా పతనం కావడంతో, ఎల్ఐసీ పెట్టుబడి విలువ ఒక్కసారిగా పడిపోయింది. రెండు రోజుల వ్యవధిలోనే ఎల్ఐసీకి రూ. 11,460 కోట్ల నుంచి రూ. 12,000 కోట్ల వరకు నష్టం వాటిల్లింది.
0 Comments