కర్ణాటకలో సిద్ధరామయ్య ప్రభుత్వం పేదలకు ఉచితంగా అవయవ మార్పిడి కోసం 1,000 పడకల ఆసుపత్రి నిర్మాణానికి పూనుకుంది. దీనికి అవసరమైన ఏర్పాట్లన్నింటినీ తక్షణమే చేపట్టనుంది. బెంగళూరులో ఏర్పాటు కానున్న ఈ 1,000 పడకల మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ప్రాజెక్ట్ లో ఈ ప్రాజెక్ట్ లో అజీమ్ ప్రేమ్‌జీ ఫౌండేషన్ భాగస్వామ్యం కానుంది. దశలవారీగా ఈ ప్రాజెక్ట్ అమలులోకి వస్తుంది. ఇందులో అజీమ్ ప్రేమ్ జీ ఫౌండేషన్ 1,000 కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెట్టనుంది. వైద్య విద్య శాఖ మంత్రి శరణ్ ప్రకాష్ పాటిల్ దీనికి సంబంధించిన వివరాలను ఇదివరకే వెల్లడించారు. తాజాగా ఫౌండేషన్ దీనిపై స్పందించింది. భాగస్వామ్యం కానున్నట్లు తెలియజేసింది. బెంగళూరు నిమ్హాన్స్ సమీపంలో 10 ఎకరాల ప్రభుత్వ భూమిని ఈ ఆసుపత్రి నిర్మాణానికి 99 సంవత్సరాల లీజుకు కేటాయిస్తారు. నిర్మాణం, నిర్వహణ ఖర్చులన్నింటినీ ఫౌండేషన్ భరిస్తుంది. ఆసుపత్రి స్థాపనకు అజీమ్ ప్రేమ్ జీ ఫౌండేషన్ 1,000 కోట్ల రూపాయలను కేటాయించిందని శరణ్ ప్రకాష్ పాటిల్ తెలిపారు. వార్షిక నిర్వహణకు దాదాపు 350 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తుందని చెప్పారు. కిడ్నీ, లివర్, ఊపిరితిత్తులు వంటి అవయవ మార్పిడులకు అత్యాధునిక చికిత్సా సదుపాయాలు ఇక్కడ లభిస్తాయి. ప్రాజెక్టు దశలుగా అమలవుతుంది. మొదటి దశలో మూడేళ్లలో 350 పడకలతో ఆసుపత్రి సిద్ధమవుతుంది. ఆ తర్వాత అయిదేళ్లలో సామర్థ్యం 1,000కి విస్తరిస్తుంది. ఈ ఆసుపత్రిలో 70 శాతం పడకలు పేద రోగులకు పూర్తిగా ఉచితంగా లభిస్తాయి. మిగిలిన 30 శాతం పడకలు నామమాత్రపు ధరలకు అందుబాటులో ఉంటాయి. ఆయుష్మాన్ భారత్- ఆరోగ్య కర్ణాటక పథకం కింద కవర్ అవుతాయి. కర్ణాటకలో అవయవ మార్పిడికి భారీ డిమాండ్ ఉంది. బెంగళూరులోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గాస్ట్రో ఎంటరాలజీ సైన్సెస్ అండ్ ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంట్ 2016 నుండి లివర్ మార్పిడులు చేస్తోంది. కొత్త ఆసుపత్రి ప్రారంభమయ్యే వరకు ఈ కేంద్రం నిర్వహణను ఫౌండేషన్ కు అప్పగించే విషయంపై చర్చలు జరుగుతున్నాయని అన్నారు.
0 Comments