హైదరాబాద్ తర్వాత వరంగల్ కు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని, ఇందులో భాగంగానే వరంగల్ ఎయిర్ పోర్ట్ కు డిసెంబర్ నెలాఖరులోగా భూసేకరణ పనులు పూర్తిచేసి వచ్చే మార్చి 31లోగా ఎయిర్ పోర్టు పనులను, వరంగల్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను, ఔటర్ రింగ్ రోడ్డు పనులను ప్రారంభిస్తామని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. హైదరాబాదుకు ఏమేమి ఉన్నాయో అవన్నీ వరంగల్ కు తీసుకువస్తాం అన్నారు. వరంగల్ జిల్లా నర్సంపేటలో 508 కోట్ల 84 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టే పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. రూ.200 కోట్ల వ్యయంతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ భవన నిర్మాణ పనులకు, రూ.130కోట్ల వ్యయంతో నిర్మించనున్న ప్రభుత్వ వైద్య కళాశాల, రూ. 56.40 కోట్ల వ్యయంతో నర్సంపేట నుండి నెక్కొండ రహదారి, రూ. 82.56 కోట్లతో హనుమకొండ -నర్సంపేట- మహబూబాబాద్ నాలుగు లైన్ల రోడ్డుకు శంకుస్థాపన చేశారు. నర్సంపేటలో రూ. 26 కోట్లతో ప్రభుత్వ నర్సింగ్ కళాశాల నిర్మాణ పనులకు, రూ. 20.కోట్లతో అంతర్గత సిసి రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం, బీటీ రోడ్లు, సెంట్రల్ లైటింగ్ నిర్మాణ పనులకు, 17.28 కోట్ల వ్యయంతో నర్సంపేట నుండి పాకాల రోడ్డు పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నర్సంపేట పట్టణంలో నిర్వహించిన ప్రజాపాలన విజయోత్సవ సభలో గత రెండేళ్ల పాలనలో తెలంగాణ రాష్ట్రం సాధించిన ప్రగతిని వివరించారు. దేశంలోనే వరి ఉత్పత్తిలో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది అన్నారు. రైతు సంక్షేమం కోసం రైతు భరోసా రైతు బీమా అందించి, సన్న వడ్లకు బోనస్ ఇస్తున్నామన్నారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు పై పేటెంట్ హక్కు తమకే ఉందని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని దోచుకున్న వారికి మాత్రమే కరెంట్ కట్ అయిందని పేర్కొన్నారు. గత సీజన్లో తొమ్మిది రోజుల్లోనే తొమ్మిది వేల కోట్లను రైతు భరోసా కింద ఇచ్చామన్నారు. గత ప్రభుత్వం పదేళ్లపాటు పేదలకు ఒక రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని, రాష్ట్రంలో 1.10కోట్ల రేషన్ కార్డుల ద్వారా 3.10 కోట్ల మంది లబ్ధిదారులకు సన్న బియ్యం ఇస్తున్నామన్నారు. రేషన్ కార్డుల్లో కొత్తవారికి మార్పులు చేర్పులు చేసే అవకాశం కల్పించామన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే దిశగా అడుగులు వేస్తూ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ను నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ అనేక పథకాలు అందిస్తున్నామని, మహిళలను కోటీశ్వరులను చేయాలన్న లక్ష్యంతో ముందుకు వెళుతున్నామని తెలిపారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో నర్సంపేట నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇళ్ళు మంజూరు చేస్తున్నట్టు పేర్కొన్నారు. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందలేదని, ప్రస్తుత ఇందిరమ్మ రాజ్యంలో అభివృద్ధి బాధ్యత తీసుకున్నామన్నారు.
0 Comments