Ad Code

మెక్సికో ఏకపక్ష సుంకాల పెంపుదలను వ్యతి రేకిస్తున్నాము : చైనా


మెక్సికోతో వాణిజ్య ఒప్పందం లేని దేశాలపై కొన్ని రకాల ఉత్పత్తుల దిగుమతిపై 50 శాతం వరకు సుంకాలను విధించింది. ఈ మేరకు మెక్సికో ఒక బిల్లుకు సెనేట్‌ ఆమోదం తెలిపింది. ఇవి 2026 జనవరి 1 నుండి అమల్లోకి వస్తాయి. ప్రతిపాదిత సుంకాల ద్వారా 3.8 బిలియన్ డాలర్ల అదనపు ఆదాయం సమకూరుతుందని అంచనా. మెక్సికోతో వాణిజ్య ఒప్పందం లేని దేశాలు భారతదేశం, దక్షిణ కొరియా, చైనా, థాయిలాండ్ , ఇండోనేషియా వంటి దేశాలపై ప్రభావం చూపుతాయి. ఈ టారిఫ్స్‌పై చైనా స్పందించింది. ఏకపక్ష సుంకాల పెంపుదలను వ్యతి రేకిస్తున్నామని పేర్కొంది. మెక్సికో ఇలాంటి తప్పుడు పద్ధతులను త్వరగా సరిదిద్దుకోవాలని కోరింది. ఎందుకంటే 2024లో 130 బిలియన్ల విలువైన ఉత్పత్తులను ఎగుమతి చేసిన చైనా ఎక్కువగా ప్రభావితమవుతుంది. ప్రధానంగా ఆటో విడిభాగాలు, తేలికపాటి కార్లు, దుస్తులు, ప్లాస్టిక్‌లు, ఉక్కు, గృహోపకరణాలు, బొమ్మలు, వస్త్రాలు, ఫర్నిచర్, పాదరక్షలు, తోలు వస్తువులు, కాగితం, కార్డ్‌బోర్డ్, మోటార్‌సైకిళ్లు, అల్యూమినియం, ట్రైలర్లు, గాజు, సబ్బులు, పరిమళ ద్రవ్యాలు, సౌందర్య సాధనాలు వంటి వస్తువులపై సుంకాలు 5 నుంచి 50 శాతం అమలు కానున్నాయి. ఆసియా దేశాల దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించాలనేది మెక్సికో ప్రధాన లక్ష్యం. మెక్సికన్ అధ్యక్షురాలు క్లాడియా షీన్‌బామ్ దేశ పరిశ్రమకు ఎక్కువ రక్షణ కల్పించాలని, దేశీయ ఉత్పత్తిని పెంచాలని భావిస్తున్నారు. ముఖ్యంగా చైనాతో దాని వాణిజ్య అసమతుల్యత గణనీయంగా ఉంది. ముఖ్యంగా భారత్‌నుంచి ఆటోమొబైల్స్‌ ఉత్పత్తులు ఎగుమతి అవుతాయి. వీటి విలువ 1 బిలియన్ డాలర్ల వరకు ఉంటుంది. వోక్స్‌వ్యాగన్, హ్యుండాయ్, నిసాన్, మారుతి సుజుకీ వంటి కంపెనీల ఎగుమతులపై ఈ ప్రభావం ఉండనుంది. కార్లపై టాక్స్ 20 శాతం నుంచి 50 శాతానికి పెరగనుంది. దక్షిణాఫ్రికా, సౌదీ అరేబియా తర్వాత మెక్సికోకు మూడో అతిపెద్ద కార్ల ఎగుమతి మార్కెట్ భారత్‌దే దీంతో భారతదేశంలోని అతిపెద్ద వాహన ఎగుమతిదారులకు భారీ షాక్‌ అని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ప్రతిపాదిత సుంకాల పెంపు భారత ఆటోమొబైల్ ఎగుమతులపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుందని భావిస్తున్న నేపథ్యంలో మెక్సికన్ ప్రభుత్వం తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలా భారత ప్రభుత్వ మద్దతును కోరుతున్నామని సుంకం ఖరారు కావడానికి ముందు ఆటో ఇండస్ట్రీ వాణిజ్య మంత్రిత్వ శాఖకు రాసిన లేఖలో పేర్కొంది.

Post a Comment

0 Comments

Close Menu