దేశంలోని ప్రముఖ రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ సంస్థలలో ఒకటైన అనరాక్ శుక్రవారం విడుదల చేసిన తాజా గణాంకాలు ప్రకారం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ ప్రస్తుతం మందగమనం దిశగా సాగుతోంది. గృహాల అమ్మకాల్లో గణనీయమైన తగ్గుదల నమోదు కావడం వల్ల, హైదరాబాద్ నివాస మార్కెట్‌పై ఒత్తిడి పెరుగుతున్నట్టు ఈ నివేదిక వెల్లడించింది. దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో 2025 సంవత్సరంలో గృహాల అమ్మకాలు గణనీయంగా తగ్గాయని అనరాక్ వెల్లడించింది. ఈ ఏడాది టాప్ 7 నగరాల్లో మొత్తం గృహాల అమ్మకాలు 14 శాతం తగ్గి సుమారు 3.96 లక్షల యూనిట్లకు పరిమితమయ్యాయి. అయితే అమ్మకాల పరిమాణం తగ్గినప్పటికీ.. విలువ పరంగా మాత్రం 6 శాతం వృద్ధి నమోదు కావడం గమనార్హం. 2024లో రూ.5.68 లక్షల కోట్లుగా ఉన్న మొత్తం అమ్మకాల విలువ.. 2025లో రూ.6 లక్షల కోట్లకు పైగా పెరిగిందని అనరాక్ తెలిపింది. గృహాల అమ్మకాలలో ఈ తగ్గుదలకు ప్రధాన కారణాలుగా ఇళ్ల ధరలు అధికంగా ఉండటమేనని తెలిపింది. అలాగే ఐటీ రంగంలో ఉద్యోగ తొలగింపులు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు,ఆర్థిక అనిశ్చితులు ఉన్నాయని అనరాక్ పేర్కొంది. ముఖ్యంగా ఐటీ రంగంపై ఆధారపడిన నగరాల్లో గృహ డిమాండ్ బలహీనపడినట్లు నివేదిక వెల్లడించింది. 2024లో టాప్ 7 నగరాల్లో 4,59,645 యూనిట్లు అమ్ముడుపోగా, 2025లో ఈ సంఖ్య 3,95,625 యూనిట్లకు తగ్గింది. ముంబై మెట్రోపాలిటన్ రీజియన్, ఢిల్లీ-ఎన్‌సిఆర్, బెంగళూరు, పూణే, కోల్‌కతా, హైదరాబాద్ వంటి ఆరు ప్రధాన నగరాల్లో అమ్మకాలు తగ్గాయి. అయితే చెన్నైలో మాత్రమే డిమాండ్ పెరిగిందని నివేదిక తెలిపింది. నగరాల వారీగా చూస్తే ఎంఎంఆర్ లో గృహాల అమ్మకాలు 18 శాతం తగ్గి 1,27,875 యూనిట్లకు చేరుకున్నాయి. ఇది గత సంవత్సరం 1,55,335 యూనిట్లు.పూణేలో అమ్మకాలు 20 శాతం తగ్గి 81,090 నుంచి 65,135 యూనిట్లకు పడిపోయాయి. బెంగళూరులో అమ్మకాలు 5 శాతం తగ్గి 62,205 యూనిట్లకు చేరుకున్నాయి. ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో గృహాల అమ్మకాలు 8 శాతం తగ్గి 57,220 యూనిట్లకు పరిమితమయ్యాయి. హైదరాబాద్‌లో అత్యధికంగా 23 శాతం తగ్గుదల నమోదై, అమ్మకాలు 58,540 నుంచి 44,885 యూనిట్లకు తగ్గాయి. కోల్‌కతాలో అమ్మకాలు 12 శాతం తగ్గి 16,125 యూనిట్లకు చేరుకున్నాయి. అయితే, ఈ ప్రతికూల పరిస్థితుల్లో కూడా చెన్నై రియల్ ఎస్టేట్ మార్కెట్ భిన్నంగా స్పందించింది. 2025లో చెన్నైలో గృహాల అమ్మకాలు 15 శాతం పెరిగి 22,180 యూనిట్లకు చేరుకున్నాయి. గత ఏడాది ఇవి 19,220 యూనిట్లుగా ఉన్నాయి. టాప్ 7 నగరాల్లో సగటు గృహ ధరలు 8 శాతం పెరిగాయి. ఈ త్రైమాసికం చివరి నాటికి చదరపు అడుగుకు సగటు ధర రూ.9,260కు చేరుకోగా, గత సంవత్సరం చివరిలో ఇది రూ.8,590గా ఉంది. అనరాక్ చైర్మన్ అనుజ్ పూరి మాట్లాడుతూ.. గత కొన్ని సంవత్సరాల్లో రెండంకెల వృద్ధి చూపిన నివాస ధరలు, 2025 నాటికి సింగిల్ డిజిట్ వృద్ధికి తగ్గడం ఆసక్తికర పరిణామం అని అన్నారు. 2025 సంవత్సరం మొత్తం మీద రియల్ ఎస్టేట్ రంగం అనేక సవాళ్లను ఎదుర్కొందని పూరి తెలిపారు. భౌగోళిక రాజకీయ గందరగోళం, ఐటీ రంగంలో ఉద్యోగ తొలగింపులు, సుంకాల ఉద్రిక్తతలు వంటి అంశాలు మార్కెట్‌పై ప్రభావం చూపాయని చెప్పారు. వచ్చే ఏడాది గృహనిర్మాణ రంగం పనితీరు ప్రధానంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేటు కోతలు, డెవలపర్లు ధరలను ఎలా నియంత్రిస్తారన్న అంశాలపై ఆధారపడి ఉంటుందని అనరాక్ చైర్మన్ అనుజ్ పూరి అభిప్రాయపడ్డారు.
0 Comments