తిరుమలలో శ్రీనివాసుడి దర్శనానికి భక్తులు భారీగా తరలి వస్తున్నారు. వరుస సెలవులు కారణంగా స్వామిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులతో ఏడు కొండులు జనసంద్రంతో నిండిపోయాయి. ఈ క్రమంలో టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేసినప్పటికీ గందరగోళం ఏర్పడింది. అలిపిరి భూదేవీ కాంప్లెక్స్‌లో భక్తుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. దర్శన టికెట్లు తీసుకునే టైంలో గందరగోళం ఏర్పడింది. దీంతో ఏర్పాట్లు సరిగా లేవని భక్తులు ఆరోపించారు. టికెట్ కౌంటర్లు పెంచాలని డిమాండ్ చేశారు. సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత ఇస్తామంటున్న టీటీడీ సిపడా కౌంటర్లు కూడా ఏర్పాటు చేయడం లేదా అని ప్రశ్నిస్తున్నారు. దీనిపై టీటీడీ సీవీఎస్వో మురళీకృష్ణ మాట్లాడుతూ సెలవుల కారణంగా తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్ వద్ద భక్తుల రద్దీ భారీగా పెరిగిందన్నారు. ఎస్ఎస్డీ టోకెన్లు పూర్తికావడంతో దివ్యదర్శనం టోకెన్ల కోసం భక్తులు కౌంటర్ల వద్దకు చేరుకున్నారని తెలిపారు. పరిస్థితిని వెంటనే గమనించిన విజిలెన్స్, సెక్యూరిటీ, పోలీసు సిబ్బంది భక్తులను క్రమబద్ధీకరించారని వివరించారు. " దర్శన టోకెన్లు పూర్తయ్యాయని భక్తులకు స్పష్టంగా తెలియజేశాం. అక్కడ ఎలాంటి లాఠీచార్జ్ గానీ, తొక్కిసలాట గానీ జరగలేదు. పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉంది. భక్తులు సిబ్బంది సూచనలు పాటించాలని, సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు వదంతులను నమ్మవద్దని కోరుతున్నాం. వదంతులు వ్యాప్తి చేసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం" అని హెచ్చరించారు. తిరుమలలో భారీగా భక్తులు ఉండడంతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.
0 Comments