ఓరుగల్లు దశ మార్చేలా కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్క్ ద్వారా యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేలా కంపెనీల పెట్టుబడులను ఆహ్వానించడానికి కేంద్రం తగిన ప్రయత్నాలు చేస్తుంది. ఇదే విషయాన్ని ఇటీవల వరంగల్లో పర్యటించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. దేశంలోని 7 మెగా టెక్స్ టైల్ పార్కుల్లో ఒకటైన కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్కు పనుల గురించి ఇటీవల సమీక్షించిన ఆయన ఇప్పటికే భూసేకరణ పనులు దాదాపు పూర్తయ్యాయని పేర్కొన్నారు. కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్క్ నిర్మాణం కోసం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి రూ.30 కోట్లు అందజేశాం. మరో రూ.30 కోట్లు త్వరలోనే కేటాయిస్తాం అని వెల్లడించారు. రూ.200 కోట్లతో కేంద్ర ప్రభుత్వం ఈ మెగా టెక్స్ టైల్ పార్కు నిర్మాణం చేపట్టనున్నామని ఆయన తెలిపారు. ఈ పార్కు ద్వారా రూ.1,700 కోట్ల పెట్టుబడులు వస్తాయి. 12,500 మందికి ఉపాధి కలుగుతుంది. ఎవర్ టాప్ టెక్స్ అనే కొరియా కంపెనీ రూ.1100 కోట్ల మేర ఈ కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ లో పెట్టుబడులు పెట్టనుంది. 11 వేల మందికి ఉపాధి కల్పిస్తామని ఒప్పందం చేసుకుందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఆహ్వానించి టెక్స్ టైల్ పార్కుకు భూమిపూజ చేయించాలనే ఉద్దేశంతో ఉన్నామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. వరంగల్ జిల్లాలోని గీసుకొండ మండల పరిధిలోని శాయంపేట గ్రామం, సంగెం మండలం పరిధిలోని చింతపల్లి గ్రామాలలో కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్క్ నిర్మాణం జరుగుతుంది. ఇది ప్రభుత్వ యాజమాన్యంలోని ప్రాజెక్టు కావడంతో దీని నిర్మాణానికి కేంద్రం సహకరిస్తుంది. తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక, మౌలిక సదుపాయాల సంస్థ దీనిని పర్యవేక్షిస్తుంది. ఈ పార్కులో పరిశ్రమలను ఏర్పాటు చేసుకోవడానికి అన్ని మౌలిక వసతులను కల్పిస్తున్నారు. ఎక్కువ భాగం మహిళలకు దీని ద్వారా ఉపాధి కల్పించాలని ప్రభుత్వం భావిస్తుంది. ఇప్పటికే ఈ పార్కులో దక్షిణ కొరియాకు చెందిన యంగ్ వన్ కార్పొరేషన్ కంపెనీ 2025 అక్టోబర్ నుండి తన వాణిజ్య ఉత్పత్తిని ప్రారంభించింది.
0 Comments