Ad Code

అక్టోబర్‌లో ఒక్క యూనిట్ కూడా అమ్ముడుపోని నిస్సాన్ ఎక్స్-ట్రైల్


దేశీయ మార్కెట్లో మాగ్నైట్ ఎస్‌యూవీతో నిస్సాన్ మళ్లీ ఊపిరి పోసుకుంది. మాగ్నైట్ సక్సెస్ తర్వాత నిస్సాన్ దేశంలో మరింత బలపడాలని నిర్ణయించుకుంది. అందులో భాగంగా ఒకప్పుడు విఫలమైన ఎక్స్-ట్రైల్ అనే భారీ ఎస్‌యూవీని టయోటా ఫార్చ్యూనర్‌ వంటి దిగ్గజాలు ఉన్న ఫుల్-సైజ్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లోకి మళ్లీ తీసుకొచ్చింది. అయితే ఈ ప్లాన్ అనుకున్నంతగా వర్కవుట్ కాలేదు. గత కొన్ని నెలలుగా ఎక్స్-ట్రైల్ అమ్మకాలు ఆందోళన కలిగిస్తున్నాయి. నిస్సాన్ ఎక్స్-ట్రైల్‌ను విదేశాలలో తయారు చేసి, కంప్లీట్లీ బిల్ట్ యూనిట్ గా భారత్‌కు దిగుమతి చేసుకుంది. దీని కారణంగా ఈ ఎస్‌యూవీ ధర చాలా ఎక్కువగా ఉంది. దీని ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ.49.92 లక్షలు ఉండగా, టాక్స్, ఇన్సూరెన్స్ వంటివి కలిపితే ఆన్-రోడ్ ధర రూ.60 లక్షల మార్కును దాటిపోయింది. ఫార్చ్యూనర్ వంటి బలమైన పోటీదారులతో పోలిస్తే ఈ అధిక ధర కారణంగా నిస్సాన్ ప్లాన్ పూర్తిగా బెడిసికొట్టింది. నిస్సాన్ దీనికి దాదాపు రూ.21 లక్షల వరకు డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించినప్పటికీ కనీసం దీన్ని కన్నెత్తి చూసిన వారే లేరు. నిస్సాన్ ఎక్స్-ట్రైల్ విక్రయాలు లేకపోవడం సంస్థకు పెద్ద షాక్ ఇచ్చింది. తాజా రిపోర్ట్ ప్రకారం 2025 అక్టోబర్‌లో ఈ ఎస్‌యూవీ ఒక్క యూనిట్ కూడా అమ్ముడుపోలేదు. అంతేకాదు గత ఐదు నెలలుగా అంటే జూన్ నుంచి అక్టోబర్ వరకు దీని విక్రయాలు సున్నా యూనిట్లుగా నమోదయ్యాయి. 2025 మే నెలలో చివరిసారిగా నిస్సాన్ X-ట్రైల్ యొక్క 20 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఆ తర్వాత ఒక్క కారు కూడా అమ్ముడుపోకపోవడం నిస్సాన్‌కు పెద్ద ఎదురుదెబ్బ. భారతదేశంలోని కస్టమర్‌లకు ప్రీమియం అనుభవాన్ని అందించాలని లక్ష్యంగా పెట్టుకున్న నిస్సాన్ ఈ అధిక ధర కారణంగా ఈ మార్కెట్‌లో విఫలమైంది. ధర ఎక్కువ ఉన్నప్పటికీ, నిస్సాన్ ఎక్స్-ట్రైల్ టెక్నాలజీ, ఫీచర్ల పరంగా చాలా మెరుగ్గా ఉంది.

Post a Comment

0 Comments

Close Menu