Ad Code

సంక్రాంతికి విశాఖపట్నం వైపు వెళ్లే రైళ్లన్నీ ఫుల్ !


సంక్రాంతి పండుగకు సొంతూర్లకు వెళ్లేందుకు ప్రయాణికులు ఇప్పటి నుంచే ముందస్తు రిజర్వేషన్ చేసుకుంటున్నారు. దీంతో సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వైపు వెళ్లే రైళ్లకు ఒక్కసారిగా డిమాండ్‌ పెరిగింది. ముందస్తు రిజర్వేషన్‌కు విండో తెరుచుకోవడంతోనే టికెట్లు హాట్‌కేకుల్లా అమ్ముడైపోయాయి. జనవరి 9వ తేదీకి సంబంధించిన టికెట్లు అప్పుడే పూర్తయిపోయాయి. సికింద్రాబాద్‌ - విశాఖపట్నం మధ్య నడిచే గోదావరి రైలుకు టికెట్ల జారీ పరిమితి మించిపోయి రిగ్రెట్‌ అని చూపిస్తుండటం గమనార్హం. ఈ రెండు స్టేషన్ల మధ్య నడిచే రెండు వందేభారత్‌ రైళ్లలో ఉదయం పూట రైలుకు టికెట్లు అందుబాటులో ఉండగా, సాయంత్రం రైలుకు వెయిటింగ్‌ లిస్ట్‌ జాబితా చూపిస్తోంది. గరీబ్‌రథ్‌, ఫలక్‌నుమా సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌, మహబూబ్‌నగర్‌ - విశాఖ సూపర్‌ ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌, విశాఖ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలో వెయిటింగ్‌ లిస్ట్‌ జాబితా దాటి రిగ్రెట్‌ చూపిస్తోంది. స్లీపర్‌, థర్డ్‌ ఏసీ, 2ఏసీ, ఫస్ట్‌ ఏసీ అనే వ్యత్యాసం లేకుండా అన్ని సీట్లూ పూర్తిగా బుక్‌ అయిపోయాయి. అదే రోజు ఉదయం పూట బయల్దేరే జన్మభూమి, కోణార్క్‌, ఈస్ట్‌కోస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు మాత్రం ఇంకా వెయిటింగ్‌ లిస్ట్‌ జాబితా చూపిస్తోంది. వచ్చే యేడాది జనవరి 13, 14, 15 తేదీల్లో భోగీ, సంక్రాంతి, కనుమ పండగలు వస్తున్నాయి. సాధారణంగా రెండ్రోజుల ముందు నుంచే సందడి ఉండడం సహజం. అయితే, ఈసారి 10, 11 తేదీల్లో శని, ఆదివారాలు రావడంతో రిజర్వేషన్ల సందడి ముందే మొదలైంది. ప్రయాణ తేదీకి 60 రోజుల ముందు నుంచే టికెట్లు బుక్‌ చేసుకునేందుకు రైల్వే శాఖ వెసులుబాటు కల్పిస్తోంది.

Post a Comment

0 Comments

Close Menu