Ad Code

పుష్పవతి అయిన కూతురిని రెండేళ్లుగా చీకటి గదిలో బంధించిన తల్లి !


ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం, చక్రపాణి వీధికి చెందిన భాగ్యలక్ష్మికి ఒడిశా కటక్ కు చెందిన నరసింహరాజుతో 2007లో పెళ్లైంది. తర్వాత కాన్పుకు పుట్టింటికి వచ్చిన భాగ్యలక్ష్మి అక్కడే ఉండిపోయింది. పదేళ్ల క్రితం భర్త చనిపోగా, కుమార్తె మౌనిక (17)తో కలిసి ఉంటోంది. ప్రైవేట్ స్కూల్లో 9వ తరగతి చదువుతున్న సమయంలో మౌనిక పుష్పవతి అయింది. అంతే భాగ్యలక్ష్మికి భయం పట్టుకుంది. పెద్దమనిషైన కూతుర్ని బయటకు పంపితే ఎవరేం చేస్తారోనన్న భయంతో చదువు మాన్పించేసింది. ఏం కావాలన్నా తనకే చెప్పాలని, ఇల్లు దాటి బయటికి వెళ్తే ఎవరో ఏదో చేస్తారని కూతురికి కూడా భయం నూరిపోసింది. ఇంటికి కరెంట్ సప్లై లేకుండా మెయిన్ స్విచ్ ను ఆపేసింది. పనిపై బయటికి వెళ్తే తాళం పెట్టి వెళ్లేది. మౌనిక చదువు గురించి ఇరుగుపొరుగు ప్రశ్నిస్తే వారిపై భాగ్యలక్ష్మి నోటితో విరుచుకుపడేది. చాలాకాలంగా మౌనిక బయటికి రాకపోవడంతో స్థానిక అంగన్ వాడీ కార్యకర్తకు అనుమానమొచ్చింది. ఐసీడీఎస్ పీఓ రాజేశ్వరికి ఫిర్యాదు చేయగా, ఆమె విషయాన్ని జూనియర్ సివిల్ జడ్జి కోర్టు న్యాయాధికారి దృష్టికి తీసుకెళ్లారు. మండల తహసీల్దారు ఎన్ వెంకటరావు, ఎంఈఓ కె.అప్పారావు, పోలీసులతో జడ్జి పరేష్ కుమార్ భాగ్యలక్ష్మి ఇంటికి వెళ్లి ధైర్యం చెప్పి ఇద్దరినీ బయటికి తీసుకొచ్చారు. ఇద్దరికీ కౌన్సెలింగ్ ఇచ్చారు. మానసిక అనారోగ్యంతో ఉన్న భాగ్యలక్ష్మిని కేజీహెచ్ కు తరలించి, మౌనికను శ్రీకాకుళం బాలల సంరక్షణ కేంద్రంలో ఉంచారు. ఆమెకు ఎలాంటి ఇబ్బందీ కలగకుండా చూసుకుంటామని భాగ్యలక్ష్మికి జడ్జి మాటిచ్చారు. 

Post a Comment

0 Comments

Close Menu