Ad Code

ఆంధ్రప్రదేశ్ లో రూ. 82,000 కోట్ల భారీ పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చిన 'రీన్యూ' సంస్థ


పునరుత్పాదక ఇంధన రంగంలో దేశంలోనే అగ్రగామిగా నిలిచింది 'రీన్యూ' సంస్థ ఆంధ్రప్రదేశ్ లో రూ. 82,000 కోట్ల భారీ పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చిందని మంత్రి లోకేష్ వెల్లడించారు. ఐదేళ్ల క్రితం రాష్ట్రం నుంచి నిష్క్రమించిన ఈ సంస్థ తిరిగి ఏపీకి రానుండటం పారిశ్రామిక వర్గాల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. ఈ విషయాన్ని మంత్రి నారా లోకేశ్ తన 'ఎక్స్' (ట్విట్టర్) అకౌంట్ ద్వారా అనౌన్స్ చేశారు. ఈ మేరకు ఆ పోస్టులో ఐదేళ్ల విరామం తర్వాత 'రీన్యూ' సంస్థ ఆంధ్రప్రదేశ్‌లో పునరుత్పాదక ఇంధన రంగంలో సంపూర్ణ పెట్టుబడి పెట్టేందుకు రావడం గర్వంగా ఉందని రాసుకొచ్చారు. రూ. 82,000 కోట్ల పెట్టుబడితో సోలార్ ఇంగాట్, వేఫర్ తయారీ వంటి హై టెక్నాలజీ విభాగాల నుంచి గ్రీన్ హైడ్రోజన్, అణువుల ఉత్పత్తి వరకు అన్ని దశల్లోనూ ఈ సంస్థ పెట్టుబడులు పెట్టనుందని పేర్కొన్నారు. అలానే విశాఖ వేదికగా జరగనున్న సీఐఐ భాగస్వామ్య సదస్సుకు హాజరవుతున్న రీన్యూ సంస్థ ఛైర్మన్ సుమంత్ సిన్హా, ఆయన బృందానికి స్వాగతం పలికారు. ఈ పెట్టుబడి ద్వారా పునరుత్పాదక ఇంధన రంగంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే కీలక కేంద్రంగా మారే అవకాశం ఉందని ప్రముఖులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వేలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయని అంటున్నారు. మరోవైపు ఈ నెల 14, 15 తేదీల్లో భాగస్వామ్య సదస్సును నిర్వహించనున్నారు. ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో భారీ పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ సదస్సు కోసం ఏర్పాట్లు చేస్తోంది. కాగా ఈ సమయంలోనే సదస్సు ప్రారంభానికి ముందే నేడు ( నవంబర్ 13, 2025 ) విశాఖలో పలు దిగ్గజ ఐటీ కంపెనీలు సహా వరల్డ్ ట్రేడ్ సెంటర్ నిర్మాణానికి మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా శంఖుస్థాపన జరగనుంది.

Post a Comment

0 Comments

Close Menu