బెంగళూరులోని ఓలా కంపెనీలో ఓ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. కంపెనీలో పనిచేసే కె. అరవింద్ (38) ఆఫీస్ లో తనను వేధిస్తున్నారని ఆరోపిస్తూ 28 పేజీల మరణ వాంగ్మూలం రాశాడు. ఈ క్రమంలో ఉద్యోగి అరవింద్ సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఓలా వ్యవస్థాపకుడు, సీఈఓ భవిష్ అగర్వాల్, సీనియర్ ఎగ్జిక్యూటివ్ సుబ్రత్ కుమార్ దాస్ పై బెంగళూరు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపట్టారు. పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ లో వెహికల్ హోమోలోగేషన్స్ అండ్ రెగ్యూలేషన్ విభాగాధిపతులు భవిష్ అగర్వాల్, సుభ్రత్ కుమార్ దాస్ పేర్లను పోలీసులు చేర్చారు. భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 108 ప్రకారం వీరిపై కేసు నమోదు చేశారు. అదేవిధంగా అరవింద్ మృతి తర్వాత కంపెనీ ఆర్థిక లావాదేవీల్లో 17.46 లక్షలు అవకతవకలు జరిగినట్లు ఫిర్యాదులో ఉంది. ఈ ఘటన సెప్టెంబర్ 28, 2025న జరిగింది. కంపెనీలో సీనియర్ అధికారులు తనను వేధిస్తున్నారంటూ 28 పేజీల సూసైడ్ నోట్ రాసిన అరవింద్.. తన ఇంట్లోనే విషం తాగాడు. వెంటనే కుటుంబ సభ్యులు అతడ్ని స్థానిక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే అతడు మృతిచెందినట్లు వైద్యులు ధృవీకరించారు. అరవింద్ బ్యాంక్ ఎకౌంట్ జరిగిన కొన్ని నగదు బదిలీ లావాదేవీలపై కంపెనీ హెచ్ ఆర్ విభాగం స్పష్టమైన వివరణ ఇవ్వలేకపోయిందని ఆరోపణలు ఉన్నాయి. మృతుడి కుటుంబం ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ లో పేర్కొన్న వారందరికీ నోటీసులు జారీ చేసినట్లు సీనియర్ దర్యాప్తు అధికారి తెలిపారు. ప్రస్తుతం ఇదే ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందన్నారు. అయితే తమపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ను సవాల్ చేస్తూ కర్ణాటక హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు కంపెనీ పేర్కొంది.
0 Comments