సీఎంఆర్, చందన బ్రదర్స్ షాపింగ్ మాల్స్ వ్యవస్థాపకుడు, ప్రముఖ వ్యాపారవేత్త చందన మోహనరావు (82) సోమవారం ఉదయం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడు తున్న ఆయన, విశాఖపట్నంలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్ర వరంలో చందన నాగేశ్వరరావు, వీరమ్మ దంపతులకు ప్రథమ సంతానంగా చందన మోహన్‌రావు జన్మించారు. చందన మోహన్‌రావుకు సుబ్బ లక్ష్మీతో వివాహమైంది. ఆయనకు ముగ్గురు కుమార్తెలు. ఐదుగురు అన్నదమ్ములు, నలుగురు అక్కా చెల్లెళ్లు. చిరుద్యోగిగా ఆయన తన కెరీర్‌ను ప్రారంభించారు. చిన్ననాటి నుండి వ్యాపార రంగంపై ఉన్న ఆసక్తితో మొట్టమొదటిసారిగా 1972లో హోల్‌సేల్ వస్త్ర వ్యాపారం ప్రారంభించారు. 1976లో రామచంద్ర క్లాత్ షోరూమ్‌ను ప్రారంభించారు. 1982లో చందన కంచి శారీస్ పేరుతో రాజమహేంద్రవరంలో మరొక వ్యాపారాన్ని ప్రారంభించారు. తన అభివృద్ధే కాకుండా, తన సోదరులను కూడా వ్యాపార రంగంలో తనతో పాటు అభివృద్ధి చెందేలా ప్రొత్సహించిన వ్యక్తి మోహన్‌రావు. విశాఖపట్నంలో మొట్టమొదటిసారిగా 1984లో జగదాంబ సెంటర్‌లో 'చందన బ్రదర్స్' పేరుతో నూతన వస్త్ర వ్యాపారాన్ని ఆరంభించి హోల్‌సేల్ రేట్లకే రిటైల్ అమ్మకం అనే కొత్త విధానం, వస్త్ర వ్యాపార రంగంలో అప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో వస్త్రాల కొనుగోలుపై ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ అనే విధానాన్ని కూడా మొట్టమొదటిసారిగా పరిచయం చేశారు. నాటి నుండి వారి వ్యాపారం నూతన ఒరవడికి శ్రీకారం చుట్టింది. 1988లో చందన బ్రదర్స్ హైదరాబాద్‌లో, చందన బ్రదర్స్‌ను విజయవాడ 1989లో తన శాఖలను ప్రారంభించారు. 1998లో జ్యూవెల్లరీ రంగంలో అడుగిడి తరువాత మొట్టమొదటి హాల్‌మార్క్ బంగారు ఆభరణాలను తెలుగు రాష్ట్రాలకు పరిచయం చేశారు. పొగడ్తలంటే ఏ మాత్రం ఇష్టపడని మోహన్‌రావు తన పేరు మీద వ్యాపారం ఆరంభించడానికి కూడా విముఖత చూపేవారు. అయినప్పటికీ అల్లుడు మావూరి వెంకటరమణ ప్రోద్భలంతో సిఎంఆర్ షాపింగ్ మాల్ పేరుతో నూతన మాల్‌ను ప్రారంభించడానికి అంగీకరించి విశాఖపట్నంలో 2022లో సిఎంఆర్ షాపింగ్ మాల్ పేరుతో నగరంలోనే మొట్టమొదటి షాపింగ్ మాల్‌ను ప్రారంభించడం విశాఖకే ఒక తలమానికం. తెలుగు రాష్ట్రాల్లోనే షాపింగ్ మాల్ అనే విధానాన్ని పరిచయం చేసిన ఘనత కూడా దీనితోనే ఆరంభమైంది. మోహన్‌రావు స్ఫూర్తితో, ప్రోద్భలంతో మావూరి వెంకటరమణ ఆధ్వర్యంలో దినదిన ప్రవర్థమానమై సిఎంఆర్ గ్రూపు ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ, ఒరిస్సా, కర్ణాటకలో శాఖోపశాఖలుగా విస్తరించి ప్రజాభిమానంతో వర్థిల్లుతోంది. మోహనరావు మృతికి పలువురు ప్రముఖులు ఆయన మృతికి సంతాపం ప్రకటించారు.
0 Comments