Ad Code

విజయవాడ నుంచి బెంగళూరు కు వందేభారత్ రైలు ?


విజయవాడ నుంచి గుంటూరు మీదుగా బెంగళూరుకు కొత్త వందేభారత్ ఏర్పాటు పైన ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. రూట్ పైన ఒక నిర్ణయానికి వచ్చారు. త్వరలోనే ఈ రైలు ప్రారంభం పైన అధికారికంగా నిర్ణయం వెలువడనుంది. వందేభారత్ రైళ్లకు తెలుగు రాష్ట్రాల నుంచి డిమాండ్ పెరుగుతోంది. విశాఖ - సికింద్రాబాద్ అదే విధంగా సికింద్రాబాద్ - తిరుపతి వందేభారత్ కు ఆశించిన స్థాయిలో ఆదరణ కనిపిస్తోంది. విజయవాడ నుంచి చెన్నై మధ్య నడుస్తున్న వందేభారత్ కు ఆదరణ పెరుగుతోంది. తెలుగు రాష్ట్రాల నుంచి బెంగళూరుకు కొత్త సర్వీసు కావాలనే డిమాండ్ పెడింగ్ లో ఉంది. ఇప్పటికే అందుబాటులో ఉన్న కాచిగూడ - యశ్వంత్ పూర్ వందేభారత్ కు ఆక్యెపెన్సీ రేషియో పెరుగుతోంది. తాజాగా, టీడీపీ లోక్ సభ పార్టీ నేత..ఎంపీ లావు శ్రీక్రిష్ణ దేవరాయులు రైల్వే మంత్రితో ఈ లైన్ లో ప్రతిపాదన పైన మరోసారి చర్చించారు. ఇప్పటికే రూట్ .. అవసరాలు.. డిమాండ్ పైన వివరంగా నివేదిక ఇచ్చిన ఎంపీ... తాజాగా పార్లమెంట్ లోనూ ఈ అంశాన్ని ప్రస్తావించారు. గుంటూరు నుంచి బెంగళూరుకు ప్రస్తుతం రైల్వే ప్రయాణం ఆశించిన స్థాయిలో లేదని, ప్రయాణీకుల ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. గుంటూరు నుంచి బెంగళూరు కు దాదాపు 16 గంటల సమయం తీసుకుంటోందని వివరించారు. దీంతో, ఈ రూట్ లో వందేభారత్ అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ ప్రతిపాదన పైన రైల్వే మంత్రి సానుకూలంగా స్పందించారు. ఇప్పటికే రైల్వే అధికారులు సైతం ఈ రైలు ఏ మార్గంలో నడపాలనే దాని పైన ప్రాధమికంగా నివేదిక సిద్దం చేసారు. గుంటూరు  మీదుగా నంద్యాల, డోన్, గుంత కల్లు, అనంతపురం, హిందూపురం, యలహంకలో స్టాపులు ఉండేలా ప్రతిపాదించారు. దీని పైన త్వరలోనే రైల్వే శాఖ అధికారికంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ మార్గం లో కొత్తగా వందేభారత్ నడిపేందుకు సాంకేతిక అంశాల పైన నివేదిక కోరినట్లు సమాచారం. వీటిని పరిశీలించిన తరువాత ఈ నెలాఖరులో లోగా వందేభారత్ కొత్త రైలు పైన నిర్ణయం వెలువడే అవకాశం కనిపిస్తోంది.

Post a Comment

0 Comments

Close Menu