ఆంధ్రప్రదేశ్ లోని తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం తాడిపర్రు గ్రామంలో ప్లెక్సీలు కడుతుండగా విద్యుత్ షాక్ తో నలుగురు యువకులు మృతి చెందారు. సర్దార్ పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా విగ్రహావిష్కరణకై ప్లెక్సీలు ఏర్పాటు చేసే పనిలో బొల్లా వీర్రాజు (25), కాశగాని కృష్ణ (23), పామర్తి నాగేంద్ర (25), మారిశెట్టి మణికంఠ పెద్దయ్య(29)తో పాటు పలువురు యువకులు నిమగ్నమయ్యారు. అయితే ఈ నలుగురు ప్లెక్సీని కట్టే క్రమంలో ప్రక్కనే గల విద్యుత్ తీగలు తగిలి నలుగురు యువకులు షాక్ కు గురయ్యారు. స్థానికులు వీరిని రక్షించేలోగానే వీరు అక్కడే కన్నుమూశారు. అలాగే ఒకరికి తీవ్ర గాయాలు కాగా, తణుకు ఏరియా వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలిస్తున్నారు. గ్రామంలో సర్దార్ పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా ప్లెక్సీలు కడుతూ నలుగురు యువకులు ఒకేసారి మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తాడిపర్రు గ్రామంలో సర్దార్ పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ ఆది నుండి వివాదాల మయమైంది. ఇరు వర్గాల మధ్య ఘర్షలు కూడా తలెత్తాయి. చివరికి మంత్రి కందుల దుర్గేష్, జిల్లా కలెక్టర్, ఆర్డీఓ, పలువురు అధికారులు, ప్రజాప్రతినిధుల చొరవతో సమస్య పరిష్కారమైంది. ఎట్టకేలకు సోమవారం విగ్రహావిష్కరణ, అన్న సమారాధన కు ఏర్పాట్లు చేస్తుండగా, దురదృష్టవశాత్తు ఈ ఘటన జరిగింది.
0 Comments