ఆంధ్రప్రదేశ్ లో రహదారుల పరిస్ధితి దృష్ట్యా వీటి నిర్వహణను ఔట్ సోర్సింగ్ ఏజెన్సీకి అప్పగించాలని నిర్ణయించినట్లు సీఎం చంద్రబాబు ఇవాళ అసెంబ్లీలో ప్రకటించారు. అయితే తొలుత దీన్ని పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయాలని నిర్ణయించారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో ముందుగా ఈ ప్రయోగం చేయనున్నారు. విజయవంతమైతే రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు విస్తరించబోతున్నారు. అలాగే వీటిపై టోల్ ఫీజు కూడా వసూలు చేయబోతున్నారు. రాష్ట్రంలోని అన్ని గ్రామీణ, మండల, రాష్ట్ర రహదారుల్ని ఔట్ సోర్సింగ్ ఏజెన్సీ ద్వారా నిర్వహించేలా ప్రభుత్వం త్వరలో పైలట్ ప్రాజెక్టుగా ఇవ్వబోతోంది. ఉభయ గోదావరి జిల్లాల నుంచి మొదలయ్యే ఈ కార్యక్రమంలో గ్రామాల నుంచి మండల కేంద్రాల వరకూ వెళ్లే రహదారులపై మాత్రం టోల్ ఫీజు వసూలు చేయరు. మిగతా రోడ్లకు మాత్రం టోల్ ఫీజు వసూలు చేస్తారు. అయితే బస్సులు, కార్లు, లారీలకు మాత్రమే ఈ టోల్ ఫీజు వసూలు చేయబోతున్నారు. ఈ మేరకు అసెంబ్లీలో నిర్ణయం తీసుకున్నాక పనులు అప్పగించనున్నారు.
0 Comments