ముంబైలో సైకిల్ స్టంట్ చేస్తుండగా అదుపు తప్పి ఓ బాలుడు గోడకు ఢీకొని అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో స్థానిక సీసీటీవీలో రికార్డవ్వడంతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మృతి చెందిన బాలుడిని 16 ఏళ్ల నీరజ్ యాదవ్‌గా గుర్తించారు. బాలుడు మీరా-భయందర్ వద్ద కోట ప్రాకారాలపై వేగంగా వెళ్తుండగా గోడను ఢీకొట్టి వెంటనే కుప్పకూలిపోయాడు. మీరారోడ్డు సమీపంలో నివసించే నీరజ్ సోమవారం సైకిల్‌పై ఘోడ్‌బందర్ కోటకు వెళ్లాడు. ఏటవాలుపై వేగంగా వెళ్తుండగా బైక్ అదుపు తప్పి ఓ ఇంటి గేటు పక్కనే ఉన్న గోడను ఢీకొట్టింది. దీంతో బాలుడు అక్కడికక్కడే కుప్పకూలిపోయి తీవ్ర రక్తస్రావమైంది. వెంటనే ప్రమాద స్థలం చుట్టూ జనం గుమిగూడారు. దారిన వెళ్లేవారు అతడిని తనిఖీ చేసేందుకు ప్రయత్నించారు. అయితే బాలుడు దేనికీ స్పందించలేదు. అనంతరం సమీపంలోని బాబా సాహెబ్ అంబేద్కర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రిలో బాలుడు చనిపోయినట్లు ప్రకటించారు. ఈ ఘటనకు సంబంధించి స్థానిక పోలీస్ స్టేషన్‌లో ప్రమాదవశాత్తూ మృతిగా కేసు నమోదైంది.
0 Comments