మింత్రా క్విక్కామర్స్లోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది. రెండు గంటల్లో ఆర్డర్లను డెలివరీ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు బెంగళూరులో ప్రయోగాత్మకంగా ఈ సేవలను అందిస్తోంది. ఎం-నౌ పేరిట ఎంపిక చేసిన పిన్కోడ్స్లో ఈ సేవలను పరిశీలిస్తోంది. ఎంపిక చేసిన ప్రొడక్టులను మాత్రమే ఈ పైలట్ ప్రాజెక్ట్ కింద అందిస్తోంది. ఇందులో వచ్చిన ఫలితాల ఆధారంగా ఇతర ప్రాంతాలకూ ఈ సేవలను విస్తరించాలని భావిస్తున్నట్లు మింత్రా ప్రతినిధి తెలిపారు. మెట్రో నగరాల్లో 2022లోనే మింత్రా ఎక్స్ప్రెస్ డెలివరీ సేవలకు శ్రీకారం చుట్టింది. ఆర్డర్ పెట్టిన 24-48 గంటల్లో ఉత్పత్తులను డెలివరీ చేయడం దీని ఉద్దేశం. గ్రాసరీ విభాగంలో ఇప్పటికే క్విక్ కామర్స్ సేవలు ఆదరణకు నోచుకుంటున్న వేళ మింత్రా ఈ రంగంలోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. మరోవైపు క్విక్ కామర్స్ రంగంలో ఉన్న సంస్థలు.. బ్యూటీ, ఫ్యాషన్ కేటగిరీలను చేర్చుకుంటున్న నేపథ్యంలో మింత్రా 'క్విక్' అవకాశాలను పరిశీలిస్తుండడం గమనార్హం.
0 Comments