దేశీయ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ (జీసీసీ) పరిశ్రమ 2030 నాటికి రూ.84.38 లక్షల కోట్లకు చేరనుంది. అందులో పనిచేసే ప్రొఫెషనల్స్ సంఖ్య 25 లక్షలకు పెరగనుంది. భారత్‌లో జీసీసీలపై రూపొందించిన ఓ నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దాని ప్రకారం ప్రస్తుతం దేశీయంగా 1,700 పైచిలుకు జీసీసీలు ఉన్నాయి. వీటి మొత్తం వార్షిక ఆదాయం 64.6 బిలియన్ డాలర్ల పైగా ఉండగా, 19 లక్షల మంది ప్రొఫెషనల్స్ వివిధ హోదాల్లో పని చేస్తున్నారు. 'భారతీయ జీసీసీలు సంఖ్యాపరంగానే కాకుండా సంక్లిష్టత, వ్యూహాత్మక ప్రాధాన్యతపరంగా కూడా ఎదుగుతున్నాయి. గడిచిన అయిదేళ్లలో సగానికి పైగా సెంటర్స్, సాంప్రదాయ సర్వీసుల పరిధికి మించి సేవలు అందిస్తున్నాయి' అని నివేదిక పేర్కొంది. 'గ్లోబల్ కార్పొరేషన్ల వ్యూహాత్మక కార్యకలాపాలకు కీలక కేంద్రంగా భారత్ ఎదుగుతోంది. ఈ నేపథ్యంలోనే జీసీసీ మార్కెట్ 2030 నాటికి 100 బిలియన్ డాలర్లకు చేరనుంది. అలాగే సిబ్బంది సంఖ్య 25 లక్షలకు చేరనుంది' అని పేర్కొంది. నివేదిక ప్రకారం 70 శాతం సెంటర్లు 2026 నాటికి అధునాతన కృత్రిమ మేథ సామర్థ్యాలను సంతరించుకోనున్నాయి. వీటిలో ఆపరేషనల్ అనలిటిక్స్ కోసం మెషిన్ లెర్నింగ్ అల్గోరిథమ్స్ మొదలుకుని ఏఐ ఆధారిత కస్టమర్ సపోర్ట్, ఆర్‌అండ్‌డీ కార్యకలాపాల వరకు వివిధ సామర్థ్యాలు ఉండనున్నాయి. తూర్పు యూరప్‌తో పోలిస్తే నిర్వహణ వ్యయాలు సగటున 40 శాతం తక్కువగా ఉండటం వల్ల నాణ్యత విషయంలో రాజీపడకుండా కార్యకలాపాలను పటిష్టం చేసుకోవడానికి అంతర్జాతీయ సంస్థలకు భారత్ ఆకర్షణీయ కేంద్రంగా మారింది. భారత్‌లో కార్యకలాపాలు సాగిస్తున్న 100 పైగా జీసీసీ దిగ్గజాలపై సర్వే, పరిశ్రమ నిపుణులతో ఇంటర్వ్యూలు, అధ్యయనాలు మొదలైన అంశాల ప్రాతిపదికన ఈ నివేదిక రూపొందింది.
0 Comments