సికింద్రాబాద్ లోని వారసిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో బాపూజీ నగర్ కు చెందిన అమరేందర్ యాదవ్ (53), సబిత (49) దంపతులు గత 20 ఏళ్లుగా నమ్మకంగా ప్రైవేట్ చిట్టీల వ్యాపారం నిర్వహిస్తున్నారు. అయితే ఇటీవలి కాలంలో చిట్టీ పాట పాడుకున్న వారికి చిట్టీ డబ్బులు ఇవ్వకుండా సతాయించడమే కాకుండా గత నెల 14న దంపతులు ఇద్దరూ కనిపించకుండా పోయారు. వారు పారిపోయారని, తాము నష్టపోయామని భావించి బాధితులు పోలీస్ స్టేషన్ కు వచ్చి ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు మొదలు పెట్టారు. కాగా మంగళవారం రోజు వారికి వారే వచ్చి పోలీసు స్టేషన్ లో ప్రత్యక్షమయ్యారు. విషయం తెలుకున్న బాధితులు పోలీస్ స్టేషన్ కు చేరుకొని ధర్నా చేశారు. వారిని కఠినంగా శిక్షించాలని తమ డబ్బులు తమకు ఇప్పించాలని డిమాండ్ చేశారు. ఎంతో కష్టపడి రూపాయి, రూపాయి జమ చేసుకొని తమ ఆడ పిల్లల పెళ్లిళ్ల కోసం, ఉన్నత చదువుల కోసం, ఇళ్ల నిర్మాణం కోసం వివిధ అవసరాలకోసం ఉపయోగించుకుందామని అమరేందర్ వద్ద దాచుకున్నమని వారు తెలిపారు. ఒక్కొక్కరు 10 లక్షలు, 20 లక్షలు, 50 లక్షలు చొప్పున చిట్టీలు వేసి మోసపోయినట్లు వారు పేర్కొన్నారు. తమ డబ్బులు తమకు ఇప్పించాలని మహిళలు, వృద్దులు కన్నీటి పర్యంతమయ్యారు.
0 Comments