లైట్ మోటార్ వెహికల్ (ఎల్ఎంవీ) డ్రైవింగ్ లైసెన్సు కలిగిన వారు 7,500 కిలోల బరువున్న రవాణా వెహికల్స్‌ను నడపొచ్చని పేర్కొంటూ సుప్రీంకోర్టు ఇవాళ తీర్పును వెలువరించింది. దీంతో కమర్షియల్ ట్రాన్స్‌పోర్ట్ వెహికల్స్‌ను నడిపే వారికి ఊరట లభించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం ఈ తీర్పు ఇచ్చింది. ''దేశంలో రోడ్డు ప్రమాదాలు ఎల్ ఎంవీ డ్రైవింగ్ లైసెన్స్ హోల్డర్ల వల్లే జరుగుతున్నాయని చెప్పలేం. సీటు బెల్ట్ పెట్టుకోకపోవడం, డ్రైవింగ్‌లో మొబైల్ వాడకం, మద్యం సేవించడం వంటివాటి వల్ల కూడా రోడ్డు ప్రమాదాలు జరగొచ్చు'' అని ధర్మాసనం పేర్కొంది. ఈ తీర్పు మన దేశంలోని బీమా కంపెనీలకు పెద్ద సవాల్ అనే చెప్పాలి. ఎందుకంటే ఆథరైజేషన్ లేకుండా ట్రాన్స్‌పోర్ట్ వాహనాలు నడుపుతున్న వారికి ఏదైనా యాక్సిడెంట్ జరిగితే ఇప్పటివరకు బీమా కంపెనీలు క్లెయిమ్ చేసుకునే హక్కును ఇవ్వడం లేదు. తాజాగా ఇవాళ తీర్పును ఇచ్చే క్రమంలో న్యాయమూర్తి జస్టిస్ హ్రిషికేశ్ రాయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ''లైట్ మోటార్ వెహికల్ లైసెన్సు కలిగిన ఎంతోమంది 7500 కిలోల బరువు ఉండే ట్రాన్స్‌పోర్ట్ వాహనాలను నడుపుతుంటారు. వారికి ఏదైనా రోడ్డు ప్రమాదం జరిగితే క్లెయిమ్‌లను పరిగణనలోకి తీసుకోవాలి. టెక్నికల్ కారణాలను చూపించి .. ఆ క్లెయిమ్‌లను రెజెక్ట్ చేయకూడదు'' అని ఆయన పేర్కొన్నారు. అయితే దీనిపై ఇన్సూరెన్స్ కంపెనీల తరఫు న్యాయవాదులు భిన్నమైన వాదనలు వినిపించారు. న్యాయ వ్యవస్థ నిత్యం ఇన్సూరెన్స్ చేయించుకున్న వాళ్ల గురించే ఆలోచిస్తోంది తప్ప.. బీమా పాలసీని విక్రయిస్తున్న వారి సమస్యలను పట్టించుకోవడం లేదని తెలిపారు. దీన్నిబట్టి బీమా కంపెనీలు పాలసీల ద్వారా లబ్ధిదారులకు ప్రయోజనాన్ని అందించే విషయంలో ఎంతగా ఆచితూచి వ్యవహరిస్తాయో మనం అర్థం చేసుకోవచ్చు.
0 Comments