ప్రసార భారతి సొంత ఓటీటీ యాప్ ను విడుదల చేసింది. వేవ్స్ పేరుతో అందుబాటులోకి తీసుకొచ్చింది. 12 భాషల్లో కంటెంట్ ను అందిస్తుందని తెలిపింది. 'ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ కి నయి లెహర్' ట్యాగ్‌లైన్ తో లాంచ్ చేసింది. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ప్రారంభ కార్యక్రమంలో గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ వేవ్స్ ఓటీటీ ప్లాట్‌ఫాం ను ప్రారంభించారు. ఈ యాప్ ఇన్ఫోటైన్‌మెంట్, గేమింగ్, ఎడ్యుకేషన్, షాపింగ్ సహా మరిన్ని విభాగాల్లో కంటెంట్ ను అందిస్తుంది తెలుగు, హిందీ, ఇంగ్లీష్, తమిళం, మరాఠీ సహా మొత్తంగా 12 భాషల్లో కంటెంట్ ను అందిస్తుందని ప్రకటనలో తెలిపింది. దీంతోపాటు 65 లైవ్ టీవీ ఛానళ్లు, ఫ్రీ టు ప్లే గేమ్ లు, వీడియో ఆన్ డిమాండ్ సహా ఓఎన్డీసీ సాయంతో ఆన్‌లైన్ షాపింగ్ కూడా చేసేందుకు అనుకూలంగా ఉంటుందని వెల్లడించింది. భారత్‌నెట్ ద్వారా కంటెంట్ యాక్సెస్ అందిస్తుందని తెలిపింది. కుటుంబ సభ్యులంతా కలిసి ఆనందించగలిగే కంటెంట్ ను వేవ్స్ ఓటీటీ యాప్ ద్వారా అందించేందుకు ప్రయత్నం చేస్తున్నామని ప్రసార భారతి ఛైర్మన్ నవనీత్ కుమార్ సెహగల్ తెలిపారు. ఎంటర్‌టైన్‌మెంట్, షాపింగ్, ఎడ్యుకేషన్ కు వేవ్స్ వన్ స్టాప్ హబ్ గా ఉంటుందని సెహగల్ అన్నారు. భారత దేశ సాంస్కృతిక వారసత్వాన్ని కొనసాగిస్తూ యువత, పిల్లలు, కుటుంబ సభ్యులు అంతా చూసేందుకు వీలుగా క్లీన్ కంటెంట్ ను అందిస్తామని ప్రసార భారతి ఛైర్మన్ తెలిపారు. ఈ వేవ్స్ ద్వారా దూరదర్శన్, ఆకారవాణి ఆర్కెవ్స్ ను చూసేందుకు అవకాశం ఉంటుందని తెలుస్తోంది. కొంకణి భాషలోనూ కంటెంట్ ను అందిస్తుంది.
0 Comments