తెలంగాణలో 40 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేసినట్లు జాతీయ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో చేసిన పోస్టుపై భారాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. రుణమాఫీ చేసినట్లు ఇచ్చిన ప్రకటనలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రూపొందించిన చిత్రాన్ని వాడారని, రైతుల లెక్క విషయంలోనూ సీఎం అదే టెక్నిక్ వాడారంటూ ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ పేర్కొన్న 40 లక్షలు అనే సంఖ్యను సీఎం రేవంత్ రెడ్డి (ఏఐ) అంటే (ఎనుముల ఇంటెలిజెన్స్)తో రూపొందించిందేనని ఎద్దేవా చేశారు. నిజానికి తెలంగాణలో ఇప్పటి వరకు రైతు రుణాలు 40 శాతం కూడా మాఫీ కాలేదని చెప్పారు. కానీ తరుచూ నిబంధనలతోపాటు రుణమాఫీ తేదీలను మారుస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి తన సొంత గ్రామం, నియోజకవర్గంలోనూ రైతులకు ఇచ్చిన హామీని నెరవేర్చడంలో విఫలమయ్యారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రుణమాఫీ విషయంలో నిబంధనలు, తేదీలు మారుతున్నాయని.. అబద్ధాలు, బూటకపు ప్రచారాలు మాత్రం నిత్యం ఎలాంటి మార్పు లేకుండా కొనసాగుతున్నాయని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
0 Comments