హైదరాబాద్ లోని కేపీహెచ్‌బీలో వివాహమైన ఎనిమిది నెలలకే సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని బలవన్మరణానికి పాల్పడింది. ఎస్‌హెచ్‌వో వెంకటేశ్వరరావు, బాధిత మహిళ తండ్రి వివరాల ప్రకారం మహబూబ్‌నగర్ జిల్లా మూసాపేట మండలం, నందిపేటకు చెందిన సుప్రియారెడ్డి (26)ను అదే జిల్లా దేవరకద్ర మండలం లక్ష్మిపల్లికి చెందిన మద్దూరు రాఘవేందర్‌రెడ్డికి ఇచ్చి మార్చి 24న వివాహం చేశారు. ఇద్దరూ సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు. కేపీహెచ్‌బీ ఠాణా పరిధి శంషీగూడలో ఉంటున్నారు. వివాహమైన నెల నుంచే రాఘవేందర్‌రెడ్డిని భార్యని వేధించసాగాడు. తాను చెప్పినట్టే వినాలని, ఆమె జీతం తన బ్యాంకు ఖాతాలోనే జమచేయాలని, ఇల్లు కట్టుకునేందుకు పుట్టింటి నుంచి మూడు ఎకరాలు రాయించుకురావాలని సుప్రియను రాఘవేందర్‌రెడ్డి ఒత్తిడి చేయసాగాడు. గురువారం రాత్రి 11.30 గంటల సమయంలో సుప్రియ ఉరేసుకున్నట్లు పక్కింటి వారు ఆమె తల్లిదండ్రులకు సమాచారమిచ్చారు. ఆ సమయంలో రాఘవేందర్‌రెడ్డి విధులకు వెళ్లాడు. తమ కుమార్తె రాత్రి 8 గంటల సమయంలో తమతో మాట్లాడిందని, ఆమె మృతిపై అనుమానం ఉన్నట్లు పోలీసులకు ఫిర్యాదు చేశామని సుప్రియరెడ్డి తండ్రి బుచ్చిరెడ్డి తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
0 Comments