అమెరికా మిల్టన్ తుఫాన్ కు చిగురుటాకులా వణికిపోతోంది. మిల్టన్ హరికేన్ తీవ్రత ఫ్లోరిడాలో ఎక్కువగా ఉంది. హరికేన్ సృష్టించిన బీభత్సానికి ఇప్పటివరకు 14మంది మృతి చెందారు. మిల్టన్ హరికేన్ దెబ్బకు ఫ్లోరిడా అతలాకుతలం అవుతోంది. గంటకు 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. మిల్టన్ దెబ్బకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో ఫ్లోరిడాలో 34 లక్షల మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఏకంగా 45 సెంటీమీటర్ల వర్షం కురిసింది. మిల్టన్ దెబ్బకు భారీ వృక్షాలు నేలకొరిగాయి. విద్యుత్ తీగలు తెగిపడటంతో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయ ఏర్పడింది. లోతట్టు ప్రాంతాల్లో వరదలు పోటెత్తాయి. ఇళ్ల నుంచి బయటకు రావొద్దని అధికారులు హెచ్చరించారు. హరికేన్ దెబ్బకు సుమారు 60 లక్షల మంది ప్రజలు ఇళ్లు ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. 20 లక్షల మందికిపైగా వరద ముప్పు పొంచి ఉందని హెచ్చరించారు. ఫ్లోరిడాలోని అనేక నగరాల్లో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. సెయింట్ లూసీ కౌంటీలో ఐదుగురు మరణించారు. ఫ్లోరిడా-అట్లాంటిక్ తీరంలోని ఇళ్లను మిల్టన్ హరికేన్ ధ్వంసం చేసింది. రహదారులపై మూడు అడుగుల మేర వరద నీరు చేరింది. ఇక నేపుల్స్ లో రికార్డు స్థాయిలో నీరు నిలిచింది. సెయింట్ పీటర్స్ బర్గ్ లో 41 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వెయ్యేళ్లలో ఇదే అత్యధిక వర్షపాతం అని అధికారులు వెల్లడించారు. ఫ్లోరిడాలో ఎయిర్ పోర్టులను నిరవధికంగా మూసేశారు అధికారులు. హరికేన్ కలిగించిన నష్టంపై అధికారులు అంచనాలు వేస్తున్నారు. హరికేన్ తో తీవ్రంగా దెబ్బతిన్న ఫ్లోరిడాను మిల్టన్ మరింత దీన దుస్థితిలోకి తీసుకెళ్లింది. ఈ ఏడాది అమెరికాను తాకిన ఐదో హరికేన్.. మిల్టన్. ఫ్లోరిడా, ఇతర రాష్ట్రాలకు చెందిన 9వేల మంది నేషనల్ గార్డ్స్ బృందాలతో కలిసి సహాయక చర్యలు చేపట్టారు. కాలిఫోర్నియా వరకు 50వేల మందికి పైగా యుటిలిటీ కార్మికులు అందుబాటులో ఉన్నారు.
0 Comments