హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌పై ఈ నెల 10న దాదాపు 10వేల మంది మహిళలతో సద్దుల బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి వెల్లడించారు. సద్దుల వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లపై సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. వివిధశాఖల కార్యదర్శులు, పోలీస్ అధికారులు సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ గురువారం సాయంత్రం 4 గంటల నుంచి సచివాలయం ఎదురుగా ఉన్న అమరవీరుల స్మారక కేంద్రం నుంచి వేలాది మంది మహిళలు బతుకమ్మలతో ఊరేగింపుగా ట్యాంక్‌బండ్ వద్దకు చేరుకుంటారన్నారు. వేలాది మంది కళాకారులు కళారూపాలతో ర్యాలీగా వస్తారన్నారు. ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేసిన వేదిక వద్ద జరిగే ఈ బతుకమ్మ ఉత్సవాలకు ప్రజాప్రతినిధులు హాజరవుతారన్నారు. ఈ సందర్భంగా బుద్ధ విగ్రహం, సంజీవయ్య పార్క్‌ల నుంచి ప్రత్యేకంగా ఫైర్ వర్క్స్, లేజర్ షో ప్రదర్శన ఉంటుందన్నారు. ఈ బతుకమ్మ ఉత్సవాలను పురస్కరించుకొని పండగ శోభ వచ్చేలా నగరంలోని 150 ప్రధాన కూడళ్లలో బతుకమ్మలను ఏర్పాటు చేయడంతో పాటు పలు జంక్షన్లను విద్యుద్దీపాలతో అలంకరించినట్లు చెప్పారు. నగరంలోని అన్ని ప్రధాన కార్యాలయాలను కూడా విద్యుత్ దీపాలతో అలంకరించాలని అధికారులను ఆదేశించారు. ట్యాంక్‌బండ్‌పై బతుకమ్మ ఆడేందుకు సమీపంలోని వాడలు, కాలనీలు, బస్తీల నుండి పెద్ద ఎత్తున మహిళలు వచ్చే అవకాశం ఉన్నందున ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ట్యాంక్‌బండ్ వద్ద ఉన్న చిల్డ్రన్స్ పార్క్‌లోని బతుకమ్మ ఘాట్‌తో పాటు నెక్లెస్ రోడ్డులో బతుకమ్మల నిమజ్జనానికి ప్రత్యేక ఏర్పాటు చేయాలని హెచ్ఎండీఏ, జీహెచ్ ఎంసీ అధికారులను కోరారు. సాయంత్రం 5.30 నుంచి 7.30 గంటల మధ్య ట్యాంక్‌బండ్‌పై బతుకమ్మ ఉత్సవాలు జరుగుతున్నందున ట్రాఫిక్ డైవర్షన్, బారికేడింగ్, కనీస సౌకర్యాల ఏర్పాట్లను చేపట్టాలని చెప్పారు. అమరవీరుల స్మారక కేంద్రం నుంచి ట్యాంక్‌బండ్ వరకు ప్రత్యేకంగా బారికేడింగ్, లైటింగ్ సౌకర్యాలను కల్పించాలని కోరారు. ప్రతీశాఖ ఒక సీనియర్ అధికారిని ప్రత్యేకంగా నియమించి ఏర్పాట్లను పర్యవేక్షించాలని సీఎస్ ఆదేశించారు. సమీక్ష సమావేశంలో ప్రభుత్వ ముఖ్య కార్యదర్శులు వాణి ప్రసాద్, దాన కిశోర్, ఆరోగ్యశాఖ కార్యదర్శి క్రిస్టినా చొంగ్తు, హైదరాబాద్ సీపీ ఆనంద్, రోడ్లు భవనాల శాఖ ప్రత్యేక కార్యదర్శి హరిచందన, ఇంధన శాఖ కార్యదర్శి రోనాల్డ్ రోస్, జీహెచ్ఎంసీ కమీషనర్ ఆమ్రపాలి కాటా, జలమండలి ఎండీ అశోక్ రెడ్డి, సమాచార శాఖ స్పెషల్ కమిషనర్ హనుమంత, వివిధశాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
0 Comments