దేశంలో అత్యంత విలువైన హౌసింగ్ ఫైనాన్స్ సంస్థగా బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ నిలిచింది. ఇటీవలే ఐపీఓ ద్వారా దేశీయ స్టాక్ మార్కెట్లలో బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ లిస్టయింది. రూ.6,560 కోట్ల నిధుల సేకరణ లక్ష్యంతో ఐపీఓకు దిగిన బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ షేర్ 63.60 రెట్లు సబ్ స్క్రైబ్ అయింది. సోమవారం దేశీయ స్టాక్ మార్కెట్లలో సంస్థ షేర్ రెట్టింపుకు పైగా లాభ పడింది. బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ సంస్థ షేర్ జారీ విలువ రూ.70 కాగా, సోమవారం దాదాపు 136 శాతం వృద్ధితో ముగిసింది. బీఎస్ఈ, ఎన్ఎస్ఈల్లో బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ షేర్ రూ.150 వద్ద స్థిర పడింది. ఎంతో కాలంగా ఇన్వెస్టర్లు ఎదురు చూస్తున్న బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ షేర్ విలువ 114.28 శాతం వృద్ధితో ముగిసింది. బీఎస్ఈలో 135.7 శాతం వృద్ధితో రూ.164.99 వద్ద అప్పర్ సర్క్యూట్ లిమిట్‌కు దూసుకెళ్లింది. ఎన్ఎస్ఈలోనూ 135.71 శాతం వృద్ధితో అప్పర్ సర్క్యూట్ వద్ద రూ.165లకు చేరుకున్నది. దీంతో బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1,37,406.09 కోట్లకు చేరుకున్నది. మార్కెట్ క్యాపిటలైజేషన్ రూపేణా హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఎం-క్యాప్ రూ.49,476.96 కోట్లతో రెండో స్థానానికి, ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ రూ.37,434.54 కోట్లతో మూడో స్థానానికి చేరాయి. తర్వాతీ స్థానాల్లో పీఎన్బీ హౌసింగ్ ఫైనాన్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.27,581.41 కోట్లు, ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ రూ.20.045 కోట్లు, అప్టస్ వాల్యూ హౌసింగ్ ఫైనాన్స్ రూ.16,598.17 కోట్లు, ఆవాస్ ఫైనాన్సియర్స్ రూ.14,278.33 కోట్లు, కాన్ ఫైన్ హోమ్స్ రూ.11,983.87 కోట్లు, సమ్మాన్ క్యాపిటల్ రూ.11,773.23 కోట్లు, హోం ఫస్ట్ ఫైనాన్స్ కంపెనీ ఇండియా రూ.10,602.99 కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ కలిగి ఉన్నాయి.
0 Comments