ఢిల్లీ ముఖ్యమంత్రిగా పదవిచేపట్టనున్న మూడో మహిళగా 43 ఏళ్ల అతిషి చరిత్ర సృష్టించనుంది. అంతకు ముందు సుష్మాస్వరాజ్, షీలా దీక్షిత్ ముఖ్యమంత్రిలుగా చేశారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా అనంతరం ఆప్ శాసనసభాపక్షం అతిషి పేరును ఏక్రగీవంగా ఆమోదించడం విశేషం. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు కొద్దినెలల ముందే ముఖ్యమంత్రి మార్పు చర్చనీయాంశమైంది. సిఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆమె ముందు ఎన్నో సవాళ్లు ఉన్నాయి. మహిళా సమ్మాన్ యోజన, ఎలక్ట్రిక్ వెహికల్ 2.0 పాలసీ వంటి కీలక ప్రాజెక్టులు, పాలసీలను ఆమోదింపజేసుకోవడానికి ఆమె క్యాబినెట్ సమావేశాలను నిర్వహించాల్సి ఉంటుంది. విధానాలను రూపొందించడంలో అతిషి కీలక పాత్ర పోషించారు. 2013 మేనిఫెస్టో ముసాయిదా కమిటీలో ఆమె కీలక సభ్యురాలిగా ఉన్నారు. అతిషి గత ఏడేళ్లుగా సేంద్రియ వ్యవసాయంపై, విద్యపై దృష్టి సారించారు. ఈ అనుభవమే పార్టీలో కీలక బాధ్యతలు నిర్వర్తించేందుకు సహాయపడింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో తూర్పు ఢిల్లీ నుంచి బిజెపికి చెందిన గౌతమ్ గంభీర్‌పై పోటీ చేశారు. కానీ అప్పుడు ఆమె ఓడిపోయారు. ఇక 2020లో ఆమె ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. కల్కాజీ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో గత ఏడాది ఫిబ్రవరిలో ఆ రాష్ట్ర ఉపముఖ్యమంత్రిగా ఉన్న మనీష్ సిసోడియా అరెస్టయ్యారు. పార్టీ సంక్షోభంలో ఉన్న సమయంలో ఆమెకు కేబినెట్‌లో చోటు దక్కింది. మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఫైనాన్స్, పిడబ్ల్యుడి (స్టేట్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్), విద్యతో సహా పలు కీలక శాఖలకు మంత్రిగా ఉన్నారు. మనీష్ సోసిడియా, అరవింద్ కేజ్రీవాల్ జైళ్లకు వెళ్లిన సమయంలో అటు పార్టీని, ఇటు ప్రభుత్వాన్ని సమర్థవంతంగా నడిపించారు. శక్తివంతమైన నాయకురాలిగా ఈ సమయంలోనే ఆమె ఎదిగారు. ఆప్ రాజ్యసభ ఎంపి స్వాతి మాలివాల్, అరవింద్ కేజ్రీవాల్ అనుచరుడు బిభవ్‌కుమార్‌పై లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఆ సమయంలో ప్రతిపక్షపార్టీలు ఆప్ పార్టీని తీవ్రంగా విమర్శించినా… ఆ విమర్శలను ఆమె ధీటుగానే ఎదుర్కొన్నారు. వేసవిలో ఢిల్లీలో నీటి సంక్షోభంతో ప్రజలు అల్లాడిపోయారు. ఆ సమయంలో ఆమె పొరుగు రాష్ట్రమైన హర్యానా నుంచి నీటిని తెప్పించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. కేంద్రం పట్టించుకోకపోవడంతో ఆమె ఢిల్లీ ప్రజల కోసం నిరాహారదీక్ష చేపట్టారు. సాహసోపేతమైన ఈ చర్యతో కేజ్రీవాల్ స్థానాన్ని ఆమె భర్తీ చేశారు. ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయలను మెరుగుపరచడం, విద్యాహక్కు చట్టం కింద స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీలను ఏర్పాటు చేయడం, ప్రైవేటు స్కూల్‌లో ఫీజులను అధికంగా పెంచకుండా నిరోధించేందుకు నిబంధనలను పటిష్టం చేయడంలో ఆమె కీలక పాత్ర పోషించారు. అతిషి 2022లో న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో 'పట్టణ పాలనకు ఢిల్లీని ప్రపంచ నమూనా హైలెట్ చేస్తూ ప్రసంగించారు. ఢిల్లీ యూనివర్సిపటీలోని సెయింట్ స్టీఫెన్స్ కాలేజ్ నుండి చరిత్రలో బ్యాచిలర్ డిగ్రీని అందుకున్నారు. అలాగే ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ నుండి చరిత్రలో పోస్టుగ్రాడ్యుయేట్ చేశారు. ఈమె తల్లిదండ్రులు విజరు సింగ్, త్రిప్తా వాహి ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్లు.
0 Comments