వరద ప్రాంతాల్లో సహాయక చర్యలపై శుక్రవారం విజయవాడ కలెక్టరేట్ వద్ద సీఎం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ బుడమేరు గండ్లు పూడ్చాలి, అదే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. వరద ప్రాంతాల్లో బాధితుల కోసం ఉచిత బస్సులు ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ''వరదల వల్ల రాష్ట్రంలో 28 మంది చనిపోయారు. ఇళ్లలో సామగ్రి నష్టానికి ఏం చేయాలనే దానిపై ఆలోచిస్తున్నాం. తెలుగు రాష్ట్రాలకు కేంద్ర సాయంపై ఇంకా సమాచారంలేదు. కేంద్రానికి ఇంకా ప్రాథమిక నివేదికలే పంపలేదు. వరద నష్టం అంచనాపై శనివారం ఉదయం ప్రాథమిక నివేదిక పంపుతాం. బాధితులకు సాయంపై కేంద్రంతో మాట్లాడుతున్నాం. ఏరియల్ సర్వే ద్వారా ముంపు ప్రాంతాలన్నీ పరిశీలించా. ప్రస్తుతంపై నుంచి ప్రవాహం రావడం లేదు. ముంపు ప్రాంతాల్లో క్రమంగా నీరు తగ్గుతోంది. ముందు బుడమేరు గండ్లు పూడ్చాలి.. అదే మా లక్ష్యం. బుడమేరు మూడో గండిని పూడ్చేందుకు సైన్యం కూడా వచ్చారు. మూడో గండిని ఇవాళ రాత్రికి పూడ్చాలని సర్వశక్తులు ఒడ్డుతున్నాం. సహాయక చర్యలు యుద్ధప్రాతిపదికన చేపట్టాం. 149 అర్బన్, 30 రూరల్ సచివాలయాల నుంచి పనులు చేపట్టాం. 3.12 లక్షల ఆహార పొట్లాలు, 11.5 లక్షల వాటర్ బాటిళ్లు, పాలు, బిస్కెట్లు, కొవ్వొత్తులు పంపిణీ చేశాం. నీరు నిల్వ ఉన్న చోట తప్ప మిగతా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా పునరుద్ధరించాం. గ్రామీణ ప్రాంతాల్లో మొత్తం విద్యుత్ కనెక్షన్లు ఇచ్చాం. వరద ప్రాంతాల్లో 72శాతం పారిశుద్ధ్య పనులు పూర్తి చేశాం. 7,100 మంది పారిశుద్ధ్య సిబ్బంది పనిచేస్తున్నారు. 1,300 పీడీఎస్ వాహనాలు తిరుగుతున్నాయి. ప్రతి కుటుంబానికి నిత్యావసరాల కిట్ ఇస్తున్నాం. మూడ్రోజుల్లో అందరికీ అందుతాయి'' అని సీఎ చంద్రబాబు వివరించారు.
0 Comments