భారీ వర్షాలతో వచ్చిన వరద నీటిని వృథా చేయకుండా భవిష్యత్తు అవసరాల కు వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టు ల పరిధిలోని రిజర్వాయర్లు, చెరువులు కుంటల్లో నీటిని నిల్వ చేయాలని సూచించారు. ఎగువన కురిసిన వర్షాలతో పాటు కడెం నుంచి వస్తున్న వరద తో పెద్దపల్లి జిల్లాలోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నిండింది. ఎల్లంపల్లి గేట్లు ఎత్తి నీటిని గోదావరి లోకి వదులుతున్నారు. మరోవైపు ఎల్లంపల్లి కి వచ్చిన వరద నీటిని వీలైనంత మేరకు లిఫ్ట్ చేయాలని, రోజుకు ఒక టీఎంసీ తగ్గకుండా డ్రా చేయాలని ఆదేశించారు. నంది, గాయత్రి పంప్ హౌస్ ల ద్వారా లిఫ్ట్ చేసి రిజర్వాయర్లు నింపాలని ముఖ్యమంత్రి సూచించారు. మిడ్ మానేరు, లోయర్ మానేరు డ్యామ్‌తో పాటు రంగనాయక్ సాగర్, మల్లన్న సాగర్ వరకు జలాశయాల్లోకి ఏకధాటిగా నీటిని లిఫ్ట్ చేయాలని ఆదేశించారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు సామర్ధ్యం 20 టీఎంసీలు కాగా ప్రస్తుతం 18.45 టీఎంసీల నీటి నిల్వ ఉంది. కడెం ప్రాజెక్టు నుంచి ప్రవాహం ఉద్ధృతంగా వస్తుండటంతో నంది, గాయత్రి పంప్ హౌస్ ల ద్వారా మిడ్ మానేరుకు నీటిని తరలిస్తున్నారు. మిడ్‌మానేరు ప్రాజెక్టు సామర్ధ్యం 27 టీఎంసీలు కాగా ప్రస్తుతం 15 టీఎంసీలు ఉంది. అక్కడి నుంచి 14 వేల క్యూసెక్కుల కు పైగా లోయర్ మానేరు డ్యామ్‌కు, మరో 6400 క్యూసెక్కులు అన్నపూర్ణ రిజర్వాయర్ ద్వారా రంగనాయక్ సాగర్‌కు తరలిస్తున్నారు. అటు రంగ నాయక సాగర్ నుంచి నీటిని పంపింగ్ చేసి మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ నింపాలని, అక్కడి నుంచి సింగూర్ ప్రాజెక్ట్, నిజాంసాగర్ ప్రాజెక్ట్ వరకు నీటిని తరలించాలని ఆదేశించారు.
0 Comments