Ad Code

న్యాయ పోరాటం చేస్తా : జయసూర్య !


నపై వచ్చిన ఆరోపణలను ఖండించిన మలయాళ నటుడు జయసూర్య న్యాయపరంగా పోరాడతానని పేర్కొన్నారు. తన పుట్టినరోజును బాధాకరంగా మార్చారని అన్నారు. ఈ మేరకు తన ఫేస్‌బుక్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు. 'నా పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన వారికి, నాకు మద్దతుగా నిలుస్తున్న అందరికీ ధన్యవాదాలు. నా వ్యక్తిగత కట్టుబాట్ల కారణంగా నేను, నా కుటుంబసభ్యులు గత నెలరోజులుగా ఆమెరికాలో ఉన్నాం. అదే సమయంలో నేను లైంగిక వేధింపులకు పాల్పడ్డాననే తప్పుడు ఆరోపణలు వచ్చాయి. ఇవి నన్ను, నా కుటుంబసభ్యులతో పాటు నాకు సన్నిహితంగా ఉండే ప్రతి ఒక్కరికీ బాధను కలిగించాయి. వీటిపై నేను న్యాయపోరాటం చేయాలని నిర్ణయించుకున్నా. మనస్సాక్షి లేనివారు తప్పుడు ఆరోపణలు చేయడం సులభం. ఆ తప్పుడు ఆరోపణలు ఎదుర్కోవడం ఎంతో బాధాకరమని వారు గ్రహిస్తారని ఆశిస్తున్నా. అబద్ధం ఎప్పుడూ నిజం కంటే వేగంగా వ్యాప్తి చెందుతుంది. కానీ, ఎప్పటికైనా నిజమే గెలుస్తుందని నమ్ముతున్నా' అని జయసూర్య పేర్కొన్నారు. అదే విధంగా ప్రస్తుతం తాను అమెరికాలో ఉన్నానని, త్వరలోనే కేరళకు తిరిగి వస్తానని జయసూర్య వెల్లడించారు. తాను నిర్దోషినని నిరూపించుకుంటానని, న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉందని పేర్కొన్నారు. జస్టిస్‌ హేమ కమిటీ రిపోర్ట్ చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో పులువురు తారలు తమకు ఎదురైన పరిస్థితుల గురించి బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. 2013లో ఒక ప్రాజెక్టు కోసం పని చేస్తున్నప్పుడు జయసూర్యతో పాటు ముఖేశ్‌, మణియన్‌పిళ్ల రాజు, ఇడవేల బాబు తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఓ నటి ఆరోపించారు. అన్నింటినీ తట్టుకొని సినిమా కోసం పనిచేశానన్నారు. అయినప్పటికీ వారి వేధింపులు మితిమీరడంతో మలయాళ చిత్రపరిశ్రమ వదిలి చెన్నైకు వెళ్లిపోయానని ఆవేదన వ్యక్తం చేశారు.

Post a Comment

0 Comments

Close Menu