అదానీ గ్రూప్ భారీ అవకతవకలకు పాల్పడిందని గతంలో ఆరోపణలు చేసి బాంబు పేల్చిన అమెరికన్ షార్ట్ సెల్లర్ హిండన్‌బర్గ్ రీసెర్చ్ సంస్థ తాజాగా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) చైర్‌పర్సన్ మాధవి పూరి బుచ్ టార్గెట్ గా రిపోర్ట్ విడుదల చేసింది. అదానీ అక్రమ లావాదేవీల కోసం ఉపయోగించిన 'రహస్య విదేశీ సంస్థలలో' ఆమెకు, ఆమె భర్తకూ వాటాలు ఉన్నాయని సంచలన ఆరోపణలతో మరో బాంబు పేల్చింది. ఇవి మారిషస్, బెర్ముడా ఫండ్స్ అని, వీటిలో బుచ్ దంపతుల వాటాల విలువ ఎంతో తెలియదని పేర్కొంది. ఈ ఫండ్స్ ద్వారా వచ్చిన నిధులను గౌతమ్ అదానీ సోదరుడు వినోద్ అదానీ వాడుకున్నారని వివరించింది. ఈ పెట్టుబడులు 2015 నాటివని, అప్పుడు మాధవి సెబీ హోల్ టైమ్ మెంబర్ అని తెలిపింది. 2022లో ఆమె సెబీ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించారు. ఈ పదవి చేపట్టడానికి కొన్ని రోజుల ముందు ఇన్వెస్ట్ మెంట్లన్నీ ఆమె భర్త ధవాల్ బుచ్ ఖాతాల్లోకి వెళ్లిపోయాయని హిండెన్ బర్గ్ ఆరోపించింది. మాధవికి ఇబ్బంది కాకుండా ఉండేందుకే ఇలా చేశారని పేర్కొంది. ఈ కారణంగానే అదానీపై తాము ఇచ్చిన నివేదికపై సెబీ చర్యలు తీసుకోలేదని ఆరోపించింది. మాధవి భర్త సీనియర్ అడ్వైజర్ గా ఉన్న బ్లాక్ స్టోన్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్స్ ను ఆమె ప్రమోట్ చేశారని పేర్కొంది. అదానీ విషయంలో సెబీని నమ్మలేమని స్పష్టం చేసింది. కాగా, అదానీ గ్రూప్‌పై మోసం, అకౌంటింగ్ అవకతవకలు, ఆర్థిక అవకతవకల వంటి తీవ్ర ఆరోపణల వల్ల ఆ కంపెనీ మార్కెట్ విలువను భారీగా కోల్పోయింది. 2023 జనవరిలో వచ్చిన హిండెన్‌బర్గ్ రిపోర్టులో అదానీ గ్రూప్ వివిధ మోసాలలో పాల్గొన్నట్లు ఆరోపించింది. దీంతో ఆ కంపెనీ మార్కెట్ విలువ 150 బిలియన్ డాలర్లకు పైగా తగ్గింది. ఈ నివేదిక తర్వాత సెబీ ఈ గ్రూప్‌పై, ముఖ్యంగా దాని విదేశీ పెట్టుబడులు, ఆర్థిక కార్యకలాపాలపై దర్యాప్తు చేపట్టినట్టు తెలుస్తోంది.
0 Comments