కన్వర్ యాత్రికులు నడిరోడ్డుపై ఓ కారులోని నలుగురు వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని మూక దాడికి పాల్పడ్డారు. కర్రలతో కారు అద్దాలు పగులగొట్టారు. అందులో ఉన్న నలుగురు వ్యక్తులు కారు దిగి ప్రాణభయంతో పరుగులు పెడుతుంటే కన్వర్ యాత్రికులు వెంబడించి మరీ కర్రలతో చితకబాదారు. చివరికి వారిలో ముగ్గురు వ్యక్తులు తప్పించుకుని పారిపోగలిగినప్పటికీ.. ఒక వ్యక్తి దొరికిపోయాడు. దాంతో అతడిని విపరీతంగా కొట్టారు. ఒంటిపై దుస్తులను చించేశారు. కన్వర్ యాత్రికులలో ఆగ్రహం కట్టలు తెంచుకోవడానికి కారణం వారు తీసుకెళ్తున్న కన్వర్‌ను ఆ నలుగురు కారుతో ఢీకొట్టడమే. తాము కన్వర్ కోసం హరిద్వార్ నుంచి పవిత్ర జలాన్ని తీసుకుని వెళ్తున్నామని, ఇంతలో నలుగురు వ్యక్తులు రాంగ్‌రూట్‌లో వచ్చి కన్వర్ ఢీకొట్టారని, రావద్దని తాము సైగలు చేసినా వాళ్లు వినిపించుకోలేదని కన్వర్ యాత్రికులు చెప్పారు. కారుతో గుద్దడంతో కన్వర్ దెబ్బతిన్నదని తెలిపారు. నడిరోడ్డుపై కన్వర్ యాత్రికుల వీరంగం చూసి వాహనదారులు భయభ్రాంతులకు గురయ్యారు. ఏం జరుగుతుందో అర్థంగాక కాసేపు ఆయోమయానికి లోనయ్యారు. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ పట్టణంలో శుక్రవారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది. కాగా సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
0 Comments