అమెరికాలో అధ్యక్ష ఎన్నికల తేదీ దగ్గరపడుతున్న కొద్దీ అభ్యర్థులు నిర్విరామంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. 81 ఏళ్ల అధ్యక్షుడు జో బైడెన్ ఈ ప్రచారపర్వంతో అలసిపోతున్నారట!. ఆ విషయాన్ని ఆయనే స్వయంగా అంగీకరించారు. తాను నిద్రపోవడానికి మరింత సమయం కావాలని, రాత్రి ఎనిమిది తర్వాత ఎలాంటి ప్రచారంలో పాల్గొనలేనని, అర్ధరాత్రి కార్యక్రమాలు వద్దని చెప్పారు. డెమోక్రాటిక్ పార్టీకి చెందిన గవర్నర్లతో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ.. ఈ విధంగా వెల్లడించినట్లు అంతర్జాతీయ మీడియా కథనం వెల్లడించింది. గతవారం రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో జరిగిన సంవాదంలో బైడెన్ తడబడిన సంగతి తెలిసిందే. దాంతో ఆయన ఇంకా రేసులో ఉండటంపై పలువురు గవర్నర్లు అసంతృప్తిగా ఉన్నప్పటికీ.. ఎవరూ ఆ విషయాన్ని నేరుగా మాత్రం ప్రస్తావించలేదని తెలుస్తోంది. మరోవైపు రాబోయే అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేది తానేనని బైడెన్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ''అధ్యక్ష ఎన్నికల్లో పోటీకి డెమోక్రాటిక్ పార్టీ నామినీని నేనే. నన్నెవరూ తప్పుకోమనడం లేదు. నేను పోటీ నుంచి వైదొలగడం లేదు. తుదివరకు పోరాడతా.. మనమే గెలవబోతున్నాం. దానికి మీ మద్దతు కావాలి'' అని తన మద్దతుదారులకు రాసిన లేఖలో ఆయన విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. సంవాదంలో తడబాటుకు గల కారణాన్ని బైడెన్ ఇదివరకే వెల్లడించారు. తన సిబ్బంది ఎంత వారించినా చర్చకు ముందు తాను పలు విదేశీ పర్యటనలకు వెళ్లానని తెలిపారు. దాని వల్ల వచ్చిన అలసట కారణంగానే వేదికపై దాదాపు నిద్రపోయినంత పనైందని పేర్కొన్నారు. అందుకే సంవాదంలో సరిగా వాదించలేకపోయినట్లు చెప్పారు.
0 Comments