కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.. ఈ సార్వత్రిక ఎన్నికల్లో రెండు చోట్లా పోటీ చేసి విజయం సాధించిన విషయం తెలిసిందే. వయనాడ్, రాయ్‌బరేలీ నుంచి ఆయన గెలుపొందారు. వీటిలో ఏ స్థానాన్ని వదులుకుంటారని సర్వత్రా ఆసక్తి నెలకొంది. తాజాగా దీనిపై రాహుల్ నిర్ణయం తీసుకున్నారు. వయనాడ్ ఎంపీ సీటును ఆయన వదులుకోనున్నారు. రాయ్‌బరేలీ ఎంపీగా ఆయన కొనసాగనున్నారు. ఈ మేరకు ఏఐసీసీ భేటీలో ఈ అంశంపై చర్చ జరిగింది. రాహుల్‌గాంధీ వయనాడ్‌ను వదులుకుంటారని కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే ప్రకటించారు. దీంతో వయనాడ్‌లో జరగనున్న ఉప ఎన్నికలో పోటీ చేసేందుకు ఆయన సోదరి, కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీకి ఛాన్స్ దక్కింది. ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేయడం ఆమెకు ఇదే తొలిసారి. ఈ సందర్భంగా ఖర్గే మాట్లాడుతూ ''రాయ్‌బరేలీ కాంగ్రెస్ కంచుకోటగా పేరొందింది. అక్కడి ప్రజలు గాంధీ కుటుంబంపై ఎంతో అభిమానం చూపుతున్నారు. అందుకే ఆ స్థానాన్నే రాహుల్ ఎంచుకోవాలని పార్టీ నిర్ణయించింది. ఇది కాంగ్రెస్ పార్టీకి మేలు చేస్తుందని భావిస్తున్నాం. వయనాడ్ ప్రజలకు కూడా కాంగ్రెస్‌పై ఎనలేని అభిమానం చూపుతున్నారు. వారి కోసం ప్రియాంకను బరిలోకి దింపుతున్నాం'' అని ఖర్గే వెల్లడించారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ భావోద్వేగానికి గురయ్యారు. ''నా పోరాటానికి వయనాడ్ ప్రజలు ఎంతో మద్దతిచ్చారు. ఆ స్థానాన్ని వదులుకోవడానికి ఎంతో మదనపడ్డా. అక్కడి ప్రజలతో నా బంధం కొనసాగుతూనే ఉంటుంది. పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటాం. ప్రియాంక వయనాడ్ ఉత్తమ ప్రతినిధి కాబోతుందని నమ్ముతున్నా'' అని రాహుల్ పేర్కొన్నారు. ''నేను మహిళనైనా వయనాడ్ నుంచి పోరాడగలను. రాహుల్ అక్కడ లేరనే భావనను వయనాడ్ ప్రజలకు కలగనివ్వను'' అని ప్రియాంక గాంధీ పేర్కొన్నారు.
0 Comments