మధ్యప్రదేశ్‌లోని ప్రభుత్వ జేహెచ్ పీజీ కళాశాలలో శుక్రవారం సాయంత్రం ఏడుగురు విద్యార్థుల గుంపు కారం పొడి, కర్రలతో కళాశాలలోకి వచ్చారు. అనంతరం ఓ తరగతి గదిలోకి ప్రవేశించి అక్కడ విద్యార్థులకు క్లాస్ చెబుతున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ నీరజ్ ధాకడ్‌పై ఒక్కసారిగా దాడికి దిగి కళ్లల్లో కారం చల్లి, కర్రలతో కొట్టారు. ఈ హఠాత్పరిణామంతో కంగుతిన్న విద్యార్థులు, ఇతర అధ్యాపకులు దాడి చేస్తున్నవారిని ఆపడానికి ప్రయత్నించారు. నీరజ్‌ను జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఆయనకు తీవ్ర గాయాలైనట్లుగా వైద్యులు పేర్కొన్నారు. దాడి దృశ్యాలు రికార్డ్ అయిన సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా హత్యాయత్నం కేసు నమోదు చేశామని నిందితులు పరారీలో ఉన్నారని, వారిని అరెస్టు చేసి తగిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. ఇటీవల కళాశాల స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్‌కు సంబంధించిన అవకతవకలపై ప్రొఫెసర్ నీరజ్‌కు, కళాశాల పూర్వ విద్యార్థి అన్నూ ఠాకూర్ మధ్య వాగ్వాదం జరిగిందని కళాశాల యాజమాన్యం తెలిపింది. ప్రొఫెసర్ సంతకాన్ని, కాలేజీ స్టాంప్‌ను దుర్వినియోగం చేయడానికి ప్రయత్నించిన ఠాకూర్‌ను నీరజ్ వారించారని ఇది వారి మధ్య ఘర్షణకు దారితీసిందని పేర్కొన్నారు.
0 Comments