లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉత్తర 24 పరగణాల జిల్లాలో బుధవారం జరిగిన బహిరంగ సభను ఉద్దేశించి మమతా బెనర్జీ మాట్లాడుతూ బీజేపీ నేతలు రిజర్వేషన్‌పై తప్పుడు ప్రచారం సాగిస్తున్నారని మండిపడ్డారు. ఆదివాసీల రిజర్వేషన్‌ను మైనారిటీలకు అప్పగిస్తారని ప్రధాని నరేంద్ర మోడీ చెబుతున్నారని, ఇది ఎప్పటికీ జరగదని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు. మైనారిటీలు ఎన్నటికీ గిరిజనుల కోటాను ముట్టుకోలేరని ఆమె స్పష్టం చేశారు. ఓ ప్రముఖ జడ్జి జారీ చేసిన ఉత్తర్వుల గురించి తాను ఈరోజే విన్నానని ఆమె చెప్పారు. కొన్ని ఏజెన్సీల ద్వారా కాషాయ నేతలు ఇలాంటి దుశ్చర్యలకు తెగబడతారని, తాను ఈ అభిప్రాయాన్ని అంగీకరించబోనని దీదీ తెలిపారు. ఈ ఉత్తర్వులు ఇచ్చిన వారు వాటిని తమ వద్దే ఉంచుకోవాలని, బీజేపీ అభిప్రాయాన్ని తాము అంగీకరించమని ఆమె స్పష్టం చేశారు. ఓబీసీ రిజర్వేషన్ కొనసాగుతుందని, ఇది ఎప్పటికీ కొనసాగుతుందని మమతా బెనర్జీ పునరుద్ఘాటించారు.
0 Comments