ఇప్పటి వరకు స్మార్ట్ ఫోన్లను ఉత్పత్తి చేసిన సంస్థ ఇకపై ఎలక్ట్రిక్ టూ వీలర్ల ఉత్పత్తిన్ని చేపట్టనుంది. స్మార్ట్ ఫోన్లలో తనకంటూ ప్రత్యేకతను చాటుకున్న మైక్రోమ్యాక్స్ సంస్థ ఇకపై ఎలక్ట్రిక్ టూవీలర్లను మార్కెట్‌లోకి తీసుకురావాలని భావిస్తోంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే సంస్థ సన్నాహాలు ప్రారంభించినట్టు తెలుస్తోంది. దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం బాగా పెరిగింది. వాటిలో అత్యధికంగా టూవీలర్లే ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో ఎలక్ట్రిక్ వాహనాల రంగంలోని పలు కొత్త కంపెనీలు ప్రవేశిస్తున్నాయి. దేశీయ స్మార్ట్‌ఫోన్ కంపెనీ మైక్రోమ్యాక్స్ ఎలక్ట్రిక్ టూవీలర్లను తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. ఎలక్ట్రిక్ టూవీలర్ల విభాగంలో ఇప్పటికే ఓలా, ఏథర్ వంటి కంపెనీలు తమ సత్తా చాటుతున్నాయి. వీటికి తోడు హీరో, బజాజ్, టీవీఎస్ వంటి ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలు సైతం ఎలక్ట్రిక్ వాహనాల తయారీలోకి అడుగుపెట్టాయి. టెక్ క్రంచ్ నివేదిక ప్రకారం.. మైక్రోమ్యాక్స్‌లో కొన్ని అస్థిరమైన పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. ఉద్యోగుల తొలగింపులు, చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్, చీఫ్ బిజినెస్ ఆఫీసర్‌తో సహా కీలక ఎగ్జిక్యూటివ్‌లు వైదొలగడం వంటి కారణాల నేపథ్యంలో కంపెనీ ఎలక్ట్రిక్ వెహికిల్స్(ఈవీ) తయారీ రంగంలో అన్వేషణకు కారణంగా చెప్పుకోవచ్చు. 2021 ఏప్రిల్లో రాహుల్ శర్మ రాజీనామా తర్వాత మేనేజింగ్ డైరెక్టర్ బాధ్యతలు స్వీకరించిన సహ వ్యవస్థాపకులలో ఒకరైన వికాస్ జైన్ కూడా కంపెనీ నుంచి వైదొలిగారు. గత ఫిబ్రవరిలో కంపెనీ వ్యవస్థాపకులు రాజేష్ అగర్వాల్, సుమీత్ కుమార్, వికాస్ జైన్‌లు కలిసి మైక్రోమ్యాక్స్ మొబిలిటీ పేరుతో కొత్త సంస్థను స్థాపించారు. ఈ కొత్త వెంచర్ మొదట ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల ఉత్పత్తిపై దృష్టి సారిస్తుందని తెలిసింది. ఇందు కోసం వ్యూహాత్మక ప్రయత్నాల్లో భాగంగా గురుగ్రామ్‌లో కార్యాలయ పునరుద్ధరణను చేపడుతున్నట్లు కంపెనీ వర్గాలు ఇప్పటికే ప్రకటించాయి. మైక్రోమ్యాక్స్ 2014 ఆగస్టులో మార్కెట్ లీడర్ శాంసంగ్‌ను అధిగమించి భారతదేశపు స్మార్ట్‌ఫోన్ కంపెనీగా అగ్రస్థానాన్ని పొందిన విషయం తెలిసిందే. ఆ తర్వాత దేశంలోకి వచ్చిన షావోమీ, ఒప్పో, వివో వంటి చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌ల రాకతో మైక్రోమ్యాక్స్ వాటి పోటీని తట్టుకోలేకపోయింది. అయితే వ్యాపార సంస్థలు తమ సంస్థను పూర్తిగా మూసివేయడానికి ఎప్పటికీ అంగీకరించవు కాబట్టి.. కొత్తగా ఇపుడు అవకాశం ఉన్న ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో అదీ టూవీలర్ల తయారీకి రంగం సిద్ధం చేసుకుంది.
0 Comments