ఇంతకుముందుతో పోలిస్తే 2022-23లో చైనానుంచి లాప్‌టాప్‌లు, పర్సనల్ కంప్యూటర్లు, ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్లు, సోలార్ సెల్స్ దిగుమతులు తగ్గుముఖం పట్టాయి. దేశీయంగా టెక్ ఉత్పత్తుల ప్రోత్సాహానికి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (పీఎల్ఐ) స్కీం ఇందుకు కారణం అని గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇన్సియేటివ్ (జీటీఆర్ఐ) పేర్కొంది. టెక్ ఉత్పత్తులు మాత్రమే కాదు మెడికల్ ఎక్విప్ మెంట్ దిగుమతులు 13 శాతం తగ్గాయని తెలిపింది. 2021-22తో పోలిస్తే 2022-23లో మెడికల్ ఎక్విప్ మెంట్ దిగుమతులు 13.6 శాతం తగ్గి దాదాపు రూ.18,087 కోట్లు (220 కోట్ల డాలర్లు)గా నిలిచాయని ఆ నివేదిక వెల్లడించింది. సోలార్ సెల్స్, పార్ట్స్, డియోడ్స్ దిగుమతులు భారీగా 70.9 శాతం .. సుమారుగా రూ.15,620 కోట్లు (190 కోట్ల డాలర్లు) తగ్గాయి. 2021-22తో పోలిస్తే గత ఆర్థిక సంవత్సరంలో లాప్‌టాప్‌లు, పర్సనల్ కంప్యూటర్ల దిగుమతులు 23.1 శాతం తగ్గిపోయాయి. వాటి విలువ సుమారు రూ.33,707 కోట్లు (410 కోట్ల డాలర్లు) ఉంటుందని జీటీఆర్ఐ వివరించింది. మొబైల్ ఫోన్ల దిగుమతులు 4.1 శాతం పడిపోయాయి. చైనా నుంచి 2021-22తో పోలిస్తే 2022-23లో రమారమీ రూ.7,000 కోట్ల (85.7 కోట్ల డాలర్లు) విలువ గల మొబైల్ ఫోన్ల దిగుమతులు తగ్గాయి. ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ల దిగుమతులు 4.5 శాతం దాదాపు రూ.38,640 కోట్లు (470 కోట్ల డాలర్లు) తగ్గాయి. యూరియా, ఇతర రసాయన ఎరువుల దిగుమతులు నాలుగో వంతు తగ్గుముఖం పట్టాయి. 2021-22తో పోలిస్తే గత ఆర్థిక సంవత్సరంలో యూరియా, ఇతర రసాయన ఎరువుల దిగుమతులు 26 శాతం.. రూ.18,909 కోట్లు (230కోట్ల డాలర్లు) పతనం అయ్యాయి. కానీ, ఎలక్ట్రానిక్ గూడ్స్, కార్ల తయారీలో వినియోగించే లిథియం అయాన్ బ్యాటరీల దిగుమతులు మాత్రం సుమారు 96 శాతం పెరిగాయి. 2021-22తో పోలిస్తే 220 కోట్ల డాలర్లకు చేరుకున్నది. కార్ల తయారీలో ఎక్కువగా వాడటం వల్ల లిథియం ఆయన్ బ్యాటరీల దిగుమతి పెరిగినట్లు తెలుస్తున్నది. 'చైనా నుంచి భారత్ దిగుమతులు తగ్గుముఖం పట్టిన సంకేతాలు కనిపిస్తున్నాయి. మూడు డేటా పాయింట్లు దిగుమతులు తగ్గినట్లు చెబుతున్నాయి. 2021-22తో పోలిస్తే ఎలక్ట్రానిక్స్ దిగుమతులు 30.3 బిలియన్ డాలర్ల నుంచి గత ఆర్థిక సంవత్సరంలో 27.6 బిలియన్ డాలర్లకు పడిపోయాయి. మొత్తం చైనా నుంచి దిగుమతులు 4.2 శాతానికి తగ్గాయి. ఇతర దేశాల నుంచి దిగుమతులు 16.1 శాతం పెరిగాయి' అని జీటీఆర్ఐ కో-ఫౌండర్ అజయ్ శ్రీవాత్సవ తెలిపారు. 2017-18లో భారత్.. చైనా దిగుమతుల వాటా 16.4 శాతం ఉంటే 2022-23 నాటికి 13.8 శాతానికి తగ్గింది. మెషినరీ, కెమికల్స్, స్టీల్, పీవీసీ అండ్ ప్లాసింగ్ ఉత్పత్తుల దిగుమతులు పెరిగాయి. వివిధ దిగుమతులు తగ్గుముఖం పట్టినా.. ఇప్పటికీ చైనా వస్తువుల దిగుమతుల్లో భారత్ టాప్ లో నిలిచింది. 2021-22లో సుమారు రూ.7,77,758 కోట్ల (94.6 బిలియన్ డాలర్లు) విలువైన దిగుమతులు నమోదైతే, గత ఆర్థిక సంవత్సరంలో రమారమీ రూ.7,48,161 కోట్ల (91 బిలియన్ డాలర్లు) విలువైన దిగుమతులు నమోదయ్యాయి. అమెరికా, యూఏఈ, నెదర్లాండ్స్ తర్వాత అత్యధికంగా చైనాకు భారత్ ఉత్పత్తులు ఎగుమతి అవుతున్నాయి.
0 Comments