ఆనందం అంటే బాధలు లేకపోవడం కాదు. బాధలు మనల్ని బాధించకపోవడం. బాధ గురించిన భావనలే మనల్ని బాధకంటే ఎక్కువగా బాధిస్తాయి. కురుక్షేత్ర యుద్ధం ప్రారంభించకుండానే అర్జునుడు విషాద యోగంలో మునిగిపోయాడు. బంధుమిత్రులను సంహరించి రాజభోగాలను అనుభవించలేనని వాపోయాడు. ధర్మానికి విరుద్ధంగా శత్రుపక్షంలో ఉన్న కౌరవులు పాండవుల పట్ల ఎప్పుడూ ద్రోహ బుద్ధితోనే ఉన్నారు. ధర్మపక్షపాతి శ్రీకృష్ణుడు ఆ విషయాన్నే చెబుతూ ‘అర్జునా! నీవు చంపకపోయినా ఇందులో బతకగల వారెవ్వరూ లేరు... చంపడం, చావడం నీ చేతిలో లేదు. నీవు కేవలం నిమిత్తమాత్రుడివి. యుద్ధం చెయ్యడం వరకే నీ కర్తవ్యం. అది పాటించు చాలు’ అంటాడు. అధర్మ నాశనానికి అర్జునుణ్ని కేవలం ఒక ఉపకరణంగా, ఆయుధంగా శ్రీకృష్ణుడు ఉపయోగించుకున్నాడు. సంహార సంకల్పం పరమాత్మది. నిర్మలమైన అంతరంగం గలవారికి సుఖదుఃఖాల అనుభూతి ఉండదు. శ్రీరమణులు క్యాన్సర్ వచ్చినప్పుడూ బాధపడిన సూచనలు ఆయన ముఖంలో ఎన్నడూ కనిపించేవి కావు. అదే మందహాసం, అదే నిర్లిప్తత!సాధారణ వ్యక్తులకది అసాధ్యం. సాధనతోనే అసాధ్యాన్ని ఎవరైనా సుసాధ్యం చేసుకోగలరు. ప్రతి మనిషికీ వారి వారి ఆలోచనలు, అభిరుచులను బట్టి జీవిత లక్ష్యాలు ఉంటాయి. అవి ఎవరికి వారికే ప్రత్యేకం. ఆనువంశికంగా ప్రజ్ఞాప్రాభవాలు లభించవు. అల్లసాని పెద్దన కొడుకు, కాళిదాసు కుమారుడు మహాకవులుగా రాణించిన దాఖలాలు లేవు. రాజు కొడుకు రాజు అవుతాడు. కానీ, రాజ్యాన్ని రక్షించుకొనే సామర్థ్యం కచ్చితంగా ఉంటుందని చెప్పలేం. అలా ఉండి ఉంటే రాజ వంశాలు అంతరించేవి కావు. మహాకవి జాషువా చెప్పినట్లు- ఎంతటి చక్రవర్తులైనా కలకాలం ఇల మీద ఉండరు. అందరూ రుద్ర భూమిలో శయనించవలసిన వారే. ప్రాపంచిక సుఖాలన్నీ సంతోషాన్ని కలిగిస్తాయి తప్ప ఆనందాన్ని ఇవ్వలేవు. ఆధ్యాత్మిక జీవితానికి పూర్తిగా అంకితమైన వారు ఆనందభావనతో ఉంటారు. ఆనందం అంటే మాటలకందని అనుభూతి. ఆ అనుభూతి వారి ముఖంలో నెలవై ఉంటుంది. ఎంతటి కష్టానికైనా వారు చలించరు. మేరుపర్వతంలా ధీరువై ఉంటారు. సేవను భాగ్యంగా భావిస్తారు. సహాయాన్నే వారు సేవగా తలుస్తారు. ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా, ఎక్కువ తక్కువల తేడా చూపకుండా, మానావమానాలు పట్టించుకోకుండా సేవలు చేసేవారే నిజమైన ఆధ్యాత్మిక జీవనం గడిపే వారిగా మనం గుర్తించవచ్చు. అలాంటివారు ఎంతో అరుదుగా కనిపిస్తారు. పురుషులందు పుణ్యపురుషులంటే అలాంటి వారే. దర్శం అంటే చెట్టును మెచ్చుకుంటూ నీడలో హాయిగా విశ్రాంతి పొందడం కాదు...! మరికొన్ని మొక్కల్ని నాటడం. వాటిని పెంచి పోషించడం, కాపాడటం. ఆ విధంగా మరెందరికో మేలు చెయ్యడం. అందరికీ మేలు జరిగే పనులు చెయ్యడంలోనే అనిర్వచనీయమైన ఆనందం లభిస్తుంది. ఈ సత్యం తెలుసుకోలేక స్వార్థంలోనే ఆనందం లభిస్తుందని ఎందరో భావిస్తుంటారు. ప్రాపంచిక ఆనందాలనేవి తాత్కాలికమే. మనకు ఎన్నో అనుభూతుల్ని ఇచ్చే శరీరమూ శాశ్వతం కాదు. ఒక్క ఆధ్యాత్మిక ఆనందమే శాశ్వతం. దాని చిరునామా అంతర్యామి అంతరాలయమే. వెతుక్కోవలసింది మనమే. ఎవరెన్ని బోధలు చేసినా, అన్ని బాధలకూ ఓర్చి అంతర్యామిని దర్శిస్తే అప్పుడు తరగని ఆధ్యాత్మిక ఆనందం మన సొత్తవుతుంది.
0 Comments