Ad Code

స్మార్ట్‌ బ్యాండేజ్‌!

 

 

సెగ్గడ్డలు వచ్చాయంటే నల్లటి పట్టీ వేసుకోవడం మనకు తెలిసిందే. అలాగే, ఏదైనా దెబ్బలు తగిలి గాయాలైతే బ్యాండేజీలు వేసుకోవడం కూడా చూస్తుంటాం. అయితే, బ్యాండేజీ లోపల పుండు మానిందీ, లేనిదీ తెలుసుకోవాలంటే ఇబ్బందిగా ఉంటుంది. బ్యాండేజీ తీసేసి గాయం మానకపోతే అయింట్‌మెంట్‌ రాసి మరో బ్యాండేజీ వేస్తుంటారు. ఇలా ఎన్నో తలనొప్పులకు పరిష్కార మార్గంగా ప్రపంచంలోనే తొలి స్మార్ట్‌ బ్యాండేజీని కనిపెట్టారు సింగపూర్‌కు చెందిన పరిశోధకులు. ఈ స్మార్ట్‌ బ్యాండేజీతో గాయానికి సంబంధించిన సమస్త సమాచారాన్ని మన మొబైల్‌ ఫోన్‌కు పంపి, దాంతో చికిత్స పొందడంలో సహకరిస్తుందంటున్నారు పరిశోధకులు. ఈ వరల్డ్‌ ఫస్ట్‌ బ్యాండేజ్‌కు సంబంధించిన సమాచారాన్ని 'సైన్స్‌ అడ్వాన్సెస్‌' జర్నల్‌లో ప్రచురించారు. ఈ స్మార్ట్ బ్యాండేజ్‌ను సింగపూర్ నేషనల్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు అభివృద్ధి పరిచారు. ఈ స్మార్ట్ బ్యాండేజ్‌ను గాయమైన ప్రదేశంలో పెట్టుకోవడం ద్వారా గాయంలో ఉన్న తేమ, వాపు కారణం, గాయంలో ఉన్న బ్యాక్టీరియా రకాన్ని 15 నిమిషాల్లో మన మొబైల్‌కు తెలియజేస్తుంది. మంటకు కారణం ఏమిటో, శరీర ఉష్ణోగ్రత ఎంతో తెలుసుకోవడం కూడా సాధ్యమవుతుంది. దీనిలో ఇన్‌స్టాల్ చేసిన సెన్సార్ సహాయంతో తీవ్రమైన గాయాల పరిస్థితి మొబైల్ యాప్ ద్వారా వినియోగదారుడికి చేరుతుంది. గాయానికి సంబంధించిన కచ్చితమైన సమాచారాన్ని అందజేస్తుందని, ఈ ప్రాజెక్ట్‌పై సింగపూర్ జనరల్ హాస్పిటల్‌తో కలిసి పని చేస్తున్నామని సింగపూర్ నేషనల్ యూనివర్శిటీకి చెందిన పరిశోధకుడు లిమ్ చివి టెక్ చెప్పారు. ఈ స్మార్ట్ బ్యాండేజ్‌కి వీ-కేర్ అని పేరు పెట్టారు. ఈ స్మార్ట్‌ బ్యాండేజ్‌లో మాయిశ్చర్‌-వికింగ్ వూండ్‌ ఫ్లూయిడ్‌ కలెక్టర్, ఫ్లెక్సిబుల్ సెన్సార్, ఎలక్ట్రానిక్ చిప్‌ ఉంటాయి. బ్యాండేజ్‌లోని చిప్ రీఛార్జిబుల్ బ్యాటరీని కలిగి ఉంది. దీనిని అవసరమైన సందర్భాల్లో ఛార్జ్ చేసుకోవచ్చు. వృద్ధులు అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవడం సహజం. అయితే, డయాబెటిస్‌తో ఉండి కాళ్ల పుండ్లు త్వరగా నయం కాక ఇబ్బందిపడుతుండటం మనం చూస్తుంటాం. రక్తంలో చక్కెరను అదుపులో పెట్టుకుంటేనే వీరిలో పుండ్లు తక్కువవుతాయి. అలాంటి పరిస్థితిలో గాయాలను పరిశీలించి సమచారాన్ని అందజేసి చికిత్స చేయడానికి సహకరిస్తుంది. గాయంలో ఎంత నీరు, తేమ అవసరమో చెప్తుంది. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో బ్యాండేజ్‌లోని సెన్సార్ తెలియజేస్తుంది. బ్యాండేజ్‌ నుంచి మొబైల్‌ యాప్‌కు అందే సమాచారాన్ని వైద్యుడికి పంపి రోగులు క్లినిక్‌ చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా చేస్తుంది. ఇప్పటివరకు ఒక ఆరోగ్య పరీక్ష నివేదిక అందేందుకు ఒకటి, రెండు రోజులు పట్టేది. ఈ బ్యాండేజ్‌ అందుబాటులోకి రావడంతో ఎక్కువ సమయం వేచి ఉండాల్సిన అవసరం లేదు. కొత్త ఫ్లెక్సిబుల్ సెన్సార్ బ్యాండేజ్.. గాయంలో ఆక్సిజన్, యూరిక్ ఆసిడ్ స్థాయిని, వాపునకు గల కారణాన్ని కూడా గుర్తించి యాప్‌కు పంపుతుంది.

Post a Comment

0 Comments

Close Menu