కర్ణాటకలో కన్నడిగుడే సర్వాధికారి : ఉద్యోగ అవకాశాలను కాలరాసే ప్రయత్నాలను ప్రభుత్వం సహించదు : ఎక్స్ వేదికగా సీఎం డీకే శివకుమార్ హెచ్చరిక

బెంగళూరులోని ఐటీ సంస్థల్లో స్థానిక కన్నడిగులకు ఉద్యోగ అవకాశాలు లభించడం లేదనే ఫిర్యాదులపై కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ తీవ్రంగా స్పందించారు. ఐటీ కంపెనీలలో స్థానికులను పక్కన పెడుతున్నారనే అంశాన్ని ప్రభుత్వం అత్యంత తీవ్రంగా పరిగణించిందని ఆయన స్పష్టం చేశారు. కర్ణాటకలో కన్నడిగుడే సర్వాధికారి, ఏ కారణం చేతనైనా కన్నడిగుల హక్కులు, ఆత్మగౌరవం, ఉద్యోగ అవకాశాలను కాలరాసే ప్రయత్నాలను ప్రభుత్వం సహించదు అంటూ ఎక్స్ వేదికగా ఆయన చేసిన హెచ్చరికలు ప్రస్తుతం కన్నడ నాట హాట్ టాఫిక్ అవుతోంది. బెంగళూరు నగరానికి లభించిన భారతదేశపు సాంకేతిక రాజధాని గుర్తింపు వెనుక స్థానిక కన్నడిగుల ప్రతిభ, నైపుణ్యం , శ్రమ దాగి ఉన్నాయని డి.కె. శివకుమార్ కొనియాడారు. ఐటీ రంగానికి ప్రభుత్వం అన్ని విధాలా మద్దతు ఇస్తున్నప్పటికీ, కొన్ని ప్రైవేట్ సంస్థలు కావాలని కన్నడిగులను పక్కన పెడుతున్నట్లు తేలితే సదరు సంస్థలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని ఘాటైన హెచ్చరికలు జారీ చేశారు. కన్నడిగుల సంక్షేమం, ఆకాంక్షలకు ప్రాతినిధ్యం వహించే తమ కాంగ్రెస్ ప్రభుత్వం వారి ప్రయోజనాలను కాపాడేందుకు ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని చెప్పుకొచ్చారు. ఈ ట్వీట్ వ్యాఖ్యల వెనుక గత కొన్ని నెలలుగా కర్ణాటకను ఊపేస్తున్న స్థానిక ఉద్యోగాల రిజర్వేషన్ బిల్లు వివాదం ఉంది. ప్రైవేట్ పరిశ్రమల్లో సి-గ్రేడ్, డి-గ్రేడ్ ఉద్యోగాలలో 100%, మేనేజ్‌మెంట్ స్థాయి పోస్టుల్లో 50% నుంచి 70% వరకు స్థానిక కన్నడిగులకే రిజర్వ్ చేయాలని సిద్ధరామయ్య ప్రభుత్వం ప్రతిపాదించిన చట్టం దుమారానికి దారితీసింది. నాస్కామ్ వంటి ఐటీ పరిశ్రమల ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు ఈ నిర్ణయం వల్ల బెంగళూరు నుంచి పెట్టుబడులు, గ్లోబల్ టాలెంట్ ఇతర రాష్ట్రాలకు తరలిపోతాయని ఆందోళన వ్యక్తం చేయడంతో ప్రభుత్వం ఆ బిల్లును తాత్కాలికంగా హోల్డ్‌లో పెట్టింది. ఐటీ కంపెనీల ఒత్తిడితో రిజర్వేషన్ బిల్లును పక్కన పెట్టారంటూ కన్నడ రక్షణ వేదిక వంటి స్థానిక సంఘాల నుంచి తీవ్ర నిరసనలు ఎదురవుతున్న తరుణంలో, డి.కె. శివకుమార్ చేసిన ఈ ప్రకటనకు ప్రాధాన్యత ఏర్పడింది. ఒకవైపు అంతర్జాతీయ స్థాయి ఐటీ హబ్‌గా బెంగళూరును నిలబెట్టుకుంటూనే, మరోవైపు కన్నడ ప్రాంతీయ భావోద్వేగాలను, స్థానిక ఉద్యోగావకాశాల నిరసనలను శాంతపరిచేందుకు కాంగ్రెస్ సర్కారు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. 

Post a Comment

Previous Post Next Post
3